Hyderabad, NOV 29: తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా (Cold Wave) పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత కూడా చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గత పది రోజులుగా సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు అయ్యింది. చలి తీవ్రతతో కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం బయటికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, 20 జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా, మరో 6 జిల్లాల్లో 19 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.1 డిగ్రీలుగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 8.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్(టీ)8.2 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేట 8.9, నిజామాబాద్ జిల్లా కోట్‌గిరి 9.7 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 9.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మార్పల్లేలో 10 డిగ్రీలుగా నమోదయ్యింది.