![](https://test1.latestly.com/wp-content/uploads/2024/03/summer-.jpg?width=380&height=214)
Hyderabad, FEB 09: వేసవి రాక ముందే ఎండలు (Temperatures) భగభగ మండిపోతున్నాయి. సాధారణంగా వేసవి కాలం ఏప్రిల్ నుంచి మే వరకు ఉంటుంది. ఆ సమయంలో ఎండలు దంచికొడతాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ ప్రభావం పెరగడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఈ ఎండల కారణంగా ఉక్కపోత మరో రెండు రోజులు ఉండనున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ క్రమంలో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేడి పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అధిక వేడి నెలకొంటుందన్నారు. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైనట్లు వాతవారణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 37.6 డిగ్రీల చొప్పున నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.