Hyderabad Rape: అమ్నీషియా పబ్‌ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో పాటు ఇద్దరు అరెస్ట్‌, ఎంఐఎం నేతల పిల్లలను కాపాడుతున్నారు: ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణ
Rape | Representational Image (Photo Credits: Pixabay)

జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఐదుగురు వ్యక్తులు ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల‍్పడ్డారు. కాగా, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో ఒక మేజర్‌, ఇద్దరు మైనర్లు ఉన్నారు. సాజిద్ మాలిక్ (18 ), వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు (16)తో పాటు మరో మైనర్ (16)ను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు.

నిందితుల ప్లాన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే....

ఇదిలా ఉంటే ఆమ్నేషియా ప‌బ్ స‌మీపంలో బాలిక‌ను అప‌హ‌రించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన నిందితులు ఈ కేసు నుంచి ఎలా త‌ప్పించుకోవాల‌న్న విష‌యంపై ముందే ప‌క్కా ప్లాన్ వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. బాలిక‌ను ఇన్నోవా కారులో ఎక్కించుకుని దాదాపుగా 2 గంట‌ల పాటు ఆమెపై కారులోనే గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డ నిందితులు ఆ త‌ర్వాత బాలిక‌ను ప‌బ్ వ‌ద్దే దింపేసి వెళ్లిన‌ట్లు పోలీసులు తేల్చారు. గ్యాంగ్ రేప్‌పై బాలిక తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యాన్ని తెలుసుకున్న నిందితులు పోలీసుల‌కు చిక్క‌కూడ‌ద‌న్న భావ‌న‌తో తామంతా గోవాకు వెళుతున్నామ‌ని చెప్పి, త‌మ సెల్ ఫోన్ల‌ను మాత్రం గోవాకు పంపి.. వాళ్లు క‌ర్ణాట‌క‌కు ప‌రార‌య్యారు.

ఇక హైద‌రాబాద్ నుంచి వెళ్లిపోయే స‌మ‌యంలో ఐదుగురూ ఐదు మార్గాల్లో పారిపోయిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇన్నోవా కారును కూడా నిందితులు దాచి పెట్టేశారు. ఈ కారుకు ప్ర‌భుత్వ వాహ‌నం అన్న స్టిక్కర్ మాత్ర‌మే ఉంద‌ని.. ఆ కారు ఇంకా టెంప‌ర‌రీ రిజిస్ట్రేష‌న్ మీదే ఉంద‌ని తెలుస్తోంది. మొత్తంగా నిందితుల్లో ఇద్ద‌రు మేజ‌ర్లు, ముగ్గురు మైన‌ర్లు ఉన్నప్పటికీ.. వారంతా క‌లిసి పోలీసుల నుంచి త‌ప్పించుకునేందుకు చాలా మార్గాల‌నే ఆశ్రయించారు.

ఎంఐఎం నేతల పిల్లలను కాపాడుతున్నారు...ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణ...

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రం.. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారంటూ ఆరోపించారు. మెర్సిడేజ్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్న ఫోటోలను రఘునందన్ రావు విడుదల చేశారు. ఈ కారులోనే నిందితులు పబ్ కు వచ్చారని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కారులోనే ఎమ్మెల్యే కొడుకు పబ్ కు వస్తున్న ఫోటోలను రఘునందన్ రావు రిలీజ్ చేశారు. బాలికను పబ్ కు తీసుకొచ్చిన బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని.. బాలికపై అతను అత్యాచారం చేశాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.

తాను చూపిస్తున్న ఫోటోలో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు అవునో కాదో పోలీసులు చెప్పాలన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. మజ్లిస్ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారని.. అందుకే మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మజ్లిస్ నేతల పిలలను వదిలేసి.. మిగితా వారిని విచారణ చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితుల అరెస్ట్ ఎందుకు చూపడం లేదని రఘునందన్ రావు పోలీసులను ప్రశ్నించారు.