Hyd, April 21: పవిత్ర రంజాన్ మాసం ఆఖరి శుక్రవారమైన జమాత్ అల్ విదా ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జి.సుదీర్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
మక్కా మసీదులో జరిగే ప్రార్థనల కారణంగా ఆ సమయంలో చార్మినార్–మదీనా, చార్మినార్–ముర్గీ చౌక్, చార్మినార్–రాజేష్ మెడికల్ హాల్ (శాలిబండ) మధ్య రోడ్లు పూర్తిగా మూసి ఉంటాయి. ఈ మార్గాల్లోకి ఎలాంటి వాహనాలు అనుమతించరు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, చార్మినార్ బస్ టెర్మినల్ పార్కింగ్, సర్దార్ మహల్ సహా ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ కేటాయించారు.ప్రధాన రహదారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు.
అదే సమయంలో సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్ కూడా మూసేస్తారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు. నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపునకు మళ్లించారు. అదేవిధంగా హిమ్మత్‌పురా, చౌక్ మైదాన్ ఖాన్, మోతిగల్లి, ఈతేబార్ చౌక్, సెహర్-ఎ-బాటిల్ కమాన్, లక్కడ్ కోటే వద్ద ట్రాఫిక్ మళ్లించనున్నారు.
మక్కా మసీదుకు వచ్చే భక్తుల వాహనాలకు ఏడు వేర్వేరు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.ఈ ఆంక్షలు, మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు వర్తిస్తాయని, సహాయ సహకారాలు అవసరమైన వాళ్లు 9010203626 నంబర్‌లో సంప్రదించాలని సుధీర్‌బాబు సూచించారు.