Hyderabad, OCT 27: తెలంగాణను చలి (Cold) వణికిస్తున్నది. రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారు జామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడురోజులు చలి తీవ్రత (Cold wave) కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు ఏర్పడగా.. ఇందులో ఒకటి నైరుతి దిశలో తమిళనాడుకు దగ్గరలో ఉన్నది. భూమికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల వరకు ఉన్నది. రెండో ఆవర్తనం తమిళనాడుకు దక్షిణంగా.. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. తెలంగాణ (Telanagana), ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ పేర్కొంది.
తూర్పు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో మేఘాలుంటాయని.. రాత్రి సమయంలో చలి ఉంటుందని తెలిపింది. తెలంగాణలో గాలులు గంటకు 4 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పింది. శుక్రవారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 31 డిగ్రీలు కాగా.. కనిష్ఠంగా 19 డిగ్రీలుగా నమోదైంది. తెల్లవారు జామున రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో 11.2 డిగ్రీల సెల్సియస్, మౌలాలిలో 11.5, బీహెచ్‌ఈఎల్‌లో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ వివరించింది.