Srisailam, Sep 5: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో (Srisailam Fire Accident) మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో అందులో పనిచేసే ఉద్యోగులు 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే. తెలంగాణ జెన్ కో బోర్డు సమావేశం (Telangana Genco council meeting) సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన విద్యుత్ సౌధలో శనివారం జరిగింది.
జెన్ కోలో జరిగిన ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని ఆయన (Genco CMD Prabhakar Rao) వెల్లడించారు. అలాగే ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు.
విషాదం, ఒక్కరూ బతకలేదు, శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంలో తొమ్మది మంది మృతి
శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందింది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంతో సంబంధం లేకుండా శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణలోకి తీసుకుని, ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చేయగలిగినంత సాయం చేయాల్సిందిగా సీఎండీని కోరారు. ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాలను పరిగణలోకి తీసుకుని, మరణించిన వారి త్యాగాన్ని, సాహసాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సహాయంపై బోర్డు విస్తృతంగా చర్చించింది. శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేకమైన అంశంగా పరిగణించి సహాయం అందించాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది.