Hyderabad, October 19: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు అన్ని రాజకీయ పార్టీల వైపు నుంచి మద్దతు లభిస్తోంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించగా, ఉద్యోగ సంఘాలు సైతం సంఘీభావం తెలిపాయి. మరోవైపు, బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
కార్మికులు, ప్రజా సంఘాలు డిపోల వద్దకు చేరుకుని కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం వైఖరిపై మండిపడుతున్నారు. డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను బయటకు రానివ్వడం లేదు. బంద్ దెబ్బకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు సైతం విధులకు హాజరుకాలేదు.
కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్ చేశారు.వారిని లాలగూడా పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో లాలగూడ పోలీస్ స్టేషన్‌లోకి మీడియాను అనుమతించకుండా పోలీసులు గేట్లను మూసి వేశారు.
కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్
ఆర్టీసీ బంద్ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు వీహెచ్, మధు యాష్కీ, సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ సహా పలువురి ఇళ్ల దగ్గర పోలీసులను మోహరించారు.
బిజెపి నేతల అరెస్ట్
జీడిమెట్ల బస్ డిపో ముందు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డితో పాటు ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కూకట్‌పల్లి బస్సు డిపోను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు.
వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల అరెస్ట్
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఆందోళన చేపట్టిన వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ్మినేని వీరభద్రం విమలక్క, చెరుకు సుధాకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు నిరసనలు, పోలీసులు అరెస్ట్‌లతో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను మోహరించింది. కీలక నేతలను అరెస్ట్ చేయించింది. అయినప్పటికీ చాలాచోట్ల ఆందోళనలు,నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.
ఆర్టీసీ బస్సుపై దాడి
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద ఓ ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీస్ భద్రత నడుమ బస్సును అక్కడినుంచి వరంగల్ వైపు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడ బస్ డిపో వద్ద డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. డీజిల్ ట్యాంకర్ టైరుకు మేకులు కొట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
వెంటనే కార్మిక సంఘాలను చర్చలకు పిలవాలన్న హైకోర్టు
మరోవైపు, ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలను వెంటనే చర్చలకు పిలవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తీర్పు ప్రతి కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. కాగా ఆర్టీసీకి రెగ్యులర్ ఎండీని నియమించని ప్రభుత్వ వైఖరి పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికులకు జీతాలు పెంచితే ఆర్టీసీ మరింత కుదేలవుతుందని ఆ సంస్థ యాజమాన్యం తన అఫిడ్‌విట్‌లో స్పష్టం చేసింది.
కేసీఆర్ వ్యూహం ఏంటీ ?
బంద్ నేపథ్యంలో అత్యవసరంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైకోర్టు కేసును తిరిగి ఈ నెల 28కి వాయిదా వేసింది. దీని ద్వారా దాదాపు పది రోజుల సమయం ఉండటంతో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని..అప్పటి వరకు తమ మాట కాదని సమ్మెకు దిగిన కార్మిక సంఘాలపైన ఒత్తిడి కొనసాగించాలనే వ్యూహం తో ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్ట మవుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి మాత్రం తన పైన ఆర్టీసీ అంశం లో రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు చేస్తున్న విమర్శల మీద సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.