తెలంగాణ ఆర్టీసీ నుంచి తొలిసారిగా ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులు రోడ్డెక్కాయి. లహరి ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ తదితరులు పాల్గొన్నారు.
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. ఈ బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.ప్రయాణికుల సౌకర్యార్థం 630 సూపర్ లగ్జరీ బస్సులను, 130 డీలక్స్ బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చామని సంస్థ ఎండీ వీ సజ్జనర్ చెప్పారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికోసం ఏసీ స్లీపర్ బస్సులను వాడకంలోకి తెస్తున్నామని వివరించారు. త్వరలోనే మరో 100 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.తొలిసారిగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయని తెలిపారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన లహరి బస్సుల్లో సీట్లను www.tsrtconline.in లో బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు.