Hyd, July 1: తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) శుభవార్తను అందించింది. ఇకపై బస్ టికెట్ రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును (Tirumala darshan ticket ) బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం శుక్రవారం నుంచే అమలులోకి రానుంది. ఈ మేరకు తిరుమలకు వెళ్లే భక్తులు ఈ అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కోరారు.
కాగా, తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ.. శ్రీవారి దర్శన టోకెన్ కూడా పొందే వీలు కల్పించింది. టీఎస్‌ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ ( reservation of bus ticket) చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఈ దర్శన టికెట్లను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం కలదు. అయితే, బస్ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌ను కూడా బుక్ చేసుకోవాలి. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ, టీటీడీల మధ్య అంగీకారం కుదిరింది.
ఇక, టీఎస్‌ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యం శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు వివరించారు. www.tsrtconline.in ఆన్‌లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చు. కనీసం 7 రోజుల ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.