Hyderabad, November 24: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు(TSRTC Employees Union) చేపట్టిన సమ్మె (TSRTC Strike) నేటికి 51వ రోజుకు చేరుకుంది. ఇటీవల విధుల్లో చేరేందుకు కార్మికులు మొగ్గు చూపినా ప్రభుత్వం (Telangana govt) నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి (Ashwathama Reddy) మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని, ఇందులో ఎటువంటి మార్పులేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ లో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. నేడు అన్ని డిపోల్లో తలపెట్టిన మానవహారాలు, మౌనదీక్షలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ఇకపైన కూడా తమ కార్యాచరణ కొనసాగుతుందని, డిపోలు, కూడళ్ల వద్ద కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
51 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్న కార్మికులకు ధన్యవాదాలు చెప్పిన ఆయన సమ్మెను కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు మానవహారాలుగా ఏర్పడి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. రేపు సేవ్ ఆర్టీసీ (Save RTC) పేరుతో అన్ని జిల్లాల్లో కార్మికులు డిపోల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌కు చిన్నచూపు తగదన్నారు.
తమ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అప్పటివరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె 51వ రోజుకు చేరుకోవడంతో ఎంజీబీఎస్‌లో మహిళా కండక్టర్లు నిరసన ప్రదర్శనకు దిగారు. సేవ్ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. సమ్మెను విరమిస్తామని చెప్పినా ప్రభుత్వం తమను విధుల్లోకి ఆహ్వానించకపోవడం దారుణం అని మహిళా కండక్టర్లు అన్నారు.