Telangana: బాగున్నారా.. గుర్తుపట్టలేదా అంటూ మాటలు కలుపుతూ ఇంట్లోకి వచ్చారు, ఆపై దాడిచేసి ఉన్నదంతా ఎత్తుకెళ్లారు, నయా ట్రెండ్ ఫాలో అవుతున్న చైన్ స్నాచర్లు
Theif! Representational Image | Photo: Pixabay

Nirmal, December 19:  'ఏం అత్తమ్మా బాగున్నారా, మన శ్రీధర్ వాళ్ల చిన్న కొడుకుకు పెళ్లి కుదిరింది, అందరూ రావాలి' అంటూ పెళ్లి పత్రికలతో బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. దీంతో ఆ మహిళ ఆశ్చర్యంగా చూడటంతో ఏం అత్తమ్మ గుర్తుపట్టలేదా, మర్చిపోయారా ఏంది? అంటూ మాటలు కలపగానే కన్ఫ్యూజ్ అయిన ఆ మహిళ ఎవరైనా దూరపు బంధువులు అయి ఉంటారేమో అనుకొని, రండ్రి.. లోపలికి రండ్రి, కూచోండ్రి టీ తీసుకొస్తా అంటూ వాళ్లకు మర్యాదలు చేయసాగింది. ఇదే అదనుగా సమయం చూసి మరికొంత ఇంట్లోకి ప్రవేశించి ఆ మహిళపై దాడి చేశారు. ఆమె మెడలోని 4 తులాల బంగారాన్ని (Gold Chain) తెంచుకొని అక్కడ్నించి పారిపోయారు.

ఈ హఠాత్పరిణామంతో షాక్ కు గురైన ఆ మహిళ కొద్ది సేపటికి తేరుకొని బయటకు వచ్చి చూసి అరిచేసరికి ఆ దొంగలు అక్కడ్నించి అప్పటికే మాయమైపోయారు.

ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది.

అనంతరం బాధితురాలు రుక్మిణి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసుల (Nirmal Police) కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలలో రోడ్లపై ఎక్కడైనా అనుమానస్పద వ్యక్తులు బైక్ పై వెళ్లే దృశ్యాలను పరిశీలిస్తూ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో చైన్ స్నాచర్లు (Chain Snatchers) ఇలా కూడా తమ టాలెంట్ చూపిస్తున్నారు. రోడ్లపై చైన్ స్నాచింగ్ చేస్తే దొరికిపోతామనే రిస్క్ ఉందనుకున్నారో ఏమో ఇలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఇళ్లలోకి చొరబడి మరీ దొంగతనం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ తరహా కేసులు గతంలో కూడా నమోదయ్యాయి. దొంగలు ఆడి, బెంజ్ లాంటి ఖరీదైన కార్లలో వచ్చి ఏదైనా లగ్జరీ అపార్టుమెంటులో దర్జాగా చొరబడి తాళం ఉన్న ఫ్లాట్స్ లక్ష్యంగా చేసుకొని ఎన్నో భారీ దోపిడీలకు పాల్పడిన ఘటనలు గతంలో నమోదయ్యాయి.