New Delhi, JAN 27: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన (Amit Shah Telangana Tour) రద్దయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది. పలు అత్యవసర పనులతో పర్యటన వాయిదా పడిందని (Amit Shah Telangana Tour Cancelled) ఆయన తెలిపారు. ఈ క్రమంలో కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ సమావేశాలను వాయిదా వేసినట్లు తెలిపారు. బిహార్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన రద్దయినట్లు తెలుస్తున్నది.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వస్తారని.. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే అమిత్ షాను బిహార్ లోక్‌జనశక్తి (రాంవిలాస్) పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే షా పర్యటన రద్దయ్యిందని, త్వరలోనే మరోసారి పర్యటన ఖరారు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.