Hyderabad, April 20: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో (Chilkur Temple) ఆదివారం జరగాల్సిన వివాహ ప్రాప్తి (Vivaha Prapti) కార్యక్రమం రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. వివాహ ప్రాప్తి కోసం రేపు కల్యాణోత్సవానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. పెళ్లి కావాల్సిన వాళ్లు తమ ఇళ్లల్లో నుంచే దేవుడ్ని ప్రార్థించుకోవాలని సూచించారు. నిన్న గరుడ ప్రసాదం (Garuda Prasadam) పంపిణీలో ఇబ్బందుల దృష్ట్యా వివాహ ప్రాప్తిని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. రేపు సాయంత్రం జరిగే కల్యాణోత్సవం యథాతథంగా జరుగుతుందని రంగరాజన్ స్పష్టం చేశారు.
నిన్న గరుడ ప్రసాదం కోసం దాదాపు 1.50 లక్షల మందికి పైగా వచ్చినట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రసాదం కేవలం 10 వేల మందికి సరిపోయేంత మాత్రమే ఉండగా ఉదయం 10 గంటలకే 70 వేల మందికి పైగా భక్తులు లైన్లలో నిల్చున్నారు. దీంతో మళ్లీ చేయించి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారుగా 35 వేల మందికి గరుడ ప్రసాదాన్ని వితరణ చేశారు. భక్తుల రద్దీతో సుమారు 5 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.