Hyderabad Rains (phot0-Video Grab)

Hyd, July 15: నైరుతి రుతుపవనాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి.వచ్చే ఐదు రోజుల పాటు తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు బలపడటంతో పాటుగా, ఆవర్తనం ప్రభావం, అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

ఆంధ్రపదేశ్ లో అల్లూరి సీతరామరాజు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉండగా.. అలాగే, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం, ప‌లు ప్రాంతాల్లో న‌రకం చూస్తున్న వాహ‌న‌దారులు,కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rain) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఆవర్తనం పశ్చిమబెంగాల్‌ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని పేర్కొన్నది. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొన్నది.  వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల గంటకు పైగా వర్షం, రహదారులు జలమయం, పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌

ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో అత్యధికంగా 15.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. భూపాలపల్లి జిల్లా కాటారంలో 11.15, ఆదిలాబాద్‌లోని కుంచవెల్లిలో 11.08, భూపాలపల్లిలోని మహదేవ్‌పూర్‌లో 11, కొయ్యూరులో 10.65, మంచిర్యాలలోని కోటపల్లిలో 9.48, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 9.48, వికారాబాద్‌లోని నవాబ్‌పేటలో 8.48, రాజధానిలోని షేక్‌పేటలో 8.45, మారేడ్‌పల్లిలో 8.4, ఖైరతాబాద్‌లో 8.4, ముషీరాబాద్‌లో 8.2, శేరిలింగంపల్లిలో 7.93 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

హైదరాబాద్ లో కూడా నిన్న పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం చాలా కాలం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ సిబ్బందిని హుటాహుటిన రంగంలోకి దించారు. హుస్సేన్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు కాగా... ప్రస్తుత నీటిమట్టం 513.41 మీటర్లుగా ఉంది.

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వరదనీటి కారణంగా పలు ప్రధాన రహదారులపై అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాగల 24గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని , హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాత్రి సమయాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. నగర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.