Hyderabad, November 13: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయా రెడ్డి (MRO Vijaya Reddy) సజీవ దహనం సంఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గల తహసీల్దార్ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు (Women Employees) అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల ద్వారా మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. మహిళా ఉద్యోగులు తమ ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే (Pepper Spray) లు వెంట తీసుకెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.
రాష్ట్రంలో సుమారు ఒక వెయ్యి మంది తహసీల్దార్లు (Tehsildars) )ఉండగా, అందులో సుమారు 400 వరకు మహిళా ఉద్యోగులు ఉన్నారు.
ఎవరూ ఊహించని విధంగా ఎమ్మార్వో విజయా రెడ్డిపై దాడి జరిగింది, దురదృష్టవషాత్తూ ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మహిళా తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు ఆత్మ రక్షణ (Self-defense) కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రెవెన్యూ శాఖ అధికారులకు సూచించింది.
నవంబర్ 04వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఎమ్మార్వో విజయా రెడ్డిపై కూర సురేశ్ అనే రైతు ఆమె ఛాంబర్ లోకి వచ్చి, భూమి పట్టా వ్యవహారంలో ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి, నిప్పంటించాడు. ఈ ఘటనలో విజయా రెడ్డి సజీవ దహనమయ్యారు.
ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు తావివ్వకుండా తహసీల్దార్ కార్యాలయాల్లో సిబ్బంది జాగ్రత్త పడుతున్నారు. చేతిలో సంచితో, బాటిళ్లు లేదా డబ్బాలు తదితర వస్తువులతో ఎమ్మార్వో కార్యాలయాలకు వచ్చేవారిని లోనికి అనుమతించడం లేదు. సందర్శకులను తనిఖీ చేసి, ఎందుకోసం వస్తున్నారు, వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.
ఇటీవల, సిరిసిల్ల పట్టణంలో కూడా ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో తహసీల్దార్ కార్యాలయానికి రావడం కలకలం సృష్టించింది. ఈ దృశ్యం అక్కడి సిబ్బందిని కొద్ది సేపు భయభ్రాంతులకు గురిచేసింది. అయితే తాను బైక్ లో పోయడం కోసం తెచ్చుకున్నానని, రోజూ ఇలాగే తెచ్చుకుంటానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఖాళీ చేతులతోనే లోపలికి అనుమతించారు. సందర్శకులు తమ వెంట ఎలాంటి వస్తువులు, సంచి లాంటివి తెచ్చుకుంటే లోపలికి అనుమతించవద్దని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ తమ సహచర సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసింది.
మొత్తానికి విజయా రెడ్డి హత్య ఘటన తర్వాత రెవెన్యూ శాఖ ఉద్యోగుల్లో ఇప్పటికీ కొంత భయాందోళన నెలకొని ఉంది. చాలా మంది ఉద్యోగులు సరిగా విధులకు హాజరు కాలేకపోతున్నారు. దీంతో చాలా చోట్ల పనులు పెండిగ్ అవుతున్నాయి. ఉద్యోగుల్లో భయం పోగొట్టడం కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఊర్లలో గ్రామ సభలు నిర్వహిస్తూ అధికారులతో ఎలా నడుచుకోవాలో వివరించడం కనిపిస్తుంది.