Washington, June 23: గాడ్జెట్ పరిశ్రమలో పట్టు సాధించిన అనంతరం భారత్‌లో సొంత క్రెడిట్ కార్డును (Apple Credit Card) లాంఛ్ చేసేందుకు టెక్ దిగ్గజం సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ (Tim cook) భారత్ పర్యటనలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవో శశిధర్ జగదీశన్‌తో భేటీ సందర్భంగా క్రెడిట్ కార్డ్ లాంఛ్ గురించి చర్చలు జరిపినట్టు సమాచారం. భారత్‌లో తన క్రెడిట్ కార్డు లాంఛ్ చేసేందుకు యాపిల్ (Apple) కసరత్తు సాగిస్తోందని, ఈ ప్రక్రియలో కార్డు జారీ దిశగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారత్‌లో యాపిల్ కార్డు లాంఛ్ సంప్రదింపులు ఇంకా ప్రాధమిక దశలో ఉన్నాయని, నిర్ధిష్టంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెబుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ సీఈవోతో పాటు కార్డు లాంఛ్‌కు సంబంధించి అవసరమైన లాంఛనాలు, విధివిధానాల గురించి చర్చించేందుకు ఆర్‌బీఐతోనూ యాపిల్ ప్రతినిధులు సమావేశమయ్యారని తెలిసింది.
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల కోసం నిర్ధిష్ట నిబంధనలను అనుసరించాలని యాపిల్‌కు ఆర్‌బీఐ సూచించింది. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రత్యేక రాయితీలూ ఉండవని ఐఫోన్ మేకర్‌కు ఆర్‌బీఐ (RBI) తేల్చిచెప్పిందని ఓ బిజినెస్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ డీల్‌పై యాపిల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌బీఐ ప్రతినిధులెవరూ ఎలాంటి అధికారిక ప్రకటనలూ వెల్లడించకపోవడం గమనార్హం.
యాపిల్ ప్రస్తుతం తన ప్రీమియం క్రెడిట్ కార్డును అమెరికాలో ఆఫర్ చేస్తోంది. గోల్డ్‌మన్ శాక్స్, మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యంతో యాపిల్ ఈ కార్డును లాంఛ్ చేసింది. డైలీ క్యాష్ బ్యాక్ రివార్డులు, వార్షిక ఫీజు రద్దు వంటి ఫీచర్లతో టైటానియం మెటల్‌తో చేసిన ఈ కార్డును యాపిల్ ఆఫర్ చేస్తోంది.