New Delhi, SEP 24: ఆపిల్ ఉత్పత్తుల్లో (apple products) తీవ్రమైన భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఐ-ఫోన్, ఐపాడ్, ఆపిల్ వాచ్ తదితర ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థ- కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (CERT-In) తెలిపింది. తత్ఫలితంగా హ్యాకర్లు (Hackers) ఆపిల్ ఉత్పత్తులను హ్యాక్ చేసి యూజర్ల డేటా తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ కాంపొనెంట్ కెర్నెల్‌తోపాటు వెబ్ కిట్ విడి భాగాల్లో లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ (CERT-In) తెలిపింది. ఈ లోపాలను అడ్డం పెట్టుకుని యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించే వీలు ఉందని పేర్కొంది. యూజర్ల వస్తువుల్లోకి మాల్వేర్ లింక్‌లు, మెసేజ్‌లు పంపి.. వారి డేటా తస్కరించే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. ఆపిల్ వాచ్‌లు, టీవీలు, ఐ-ఫోన్లు, మ్యాక్ బుక్స్ సాఫ్ట్ వేర్‌ల్లో లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ తెలిపింది.
మ్యాక్ ఓఎస్ వర్షన్ 12.7, మ్యాక్ ఓఎస్ 13.6, వాచ్ ఓఎస్ 9.6.3, వాచ్ ఓఎస్ 10.0.1, ఐఓఎస్ 17.0.1, ఐపాడ్ ఓఎస్ 17.0.1 ఓఎస్‌ల్లో లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ తెలిపింది. ఐ-ఫోన్ తాజా వర్షన్ ఓఎస్ ఐఓఎస్ 17.0.1 వర్షన్, ఆపిల్ సఫారీ వర్షన్ 16.6.1 లోనూ లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ పేర్కొనడంతో త్వరలో ఆపిల్ కొత్త ఓఎస్ అప్ డేట్ రిలీజ్ చేస్తుందని తెలుస్తున్నది.