ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఉత్పత్తులంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతారు. ఆ కంపెనీ ఉత్పత్తులు మన చేతిలో ఉంటే చాలా రిచ్ గా కూడా ఫీల్ అవుతారు. రిచ్ సంగతి ఎలా ఉన్నా ఆపిల్ ఉత్పత్తులు ఇప్పుడు మనిషి ప్రాణాల్ని కూడా కాపాడుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం..ఆపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఆపిల్ వాచ్ తన తండ్రిని ఎలా కాపాడిందో తెలుపుతూ అతని కుమారుడు ఫేస్‌బుక్‌లో అనుభవాన్ని పోస్ట్ చేశాడు. వివరాల్లోకెళితే గాబ్ బర్డెట్ (Burdett), అతని తండ్రి బైక్‌పై పర్వతారోహణకు వెళ్లారు. చెరో మార్గం గుండా పర్వతాన్ని అధిరోహిస్తుండగా.. తన తండ్రి ప్రమాదంలో ఉన్నట్టు అతని చేతికున్న ఆపిల్ వాచ్ ( Apple watch) నుంచి బర్డెట్ వాచ్‌కు అలర్ట్ వచ్చింది.అలర్ట్ రావడమే కాకుండా అతని తండ్రి ఉన్న ప్రదేశాన్ని సైతం ఆపిల్ వాచ్ షేర్ చేసింది. దీంతో కంగారు పడిన అతని కుమారుడు బర్డెట్ సదరు ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నాడు.
అయితే, అక్కడ తన తండ్రి కనిపించకపోవడంతో నిరాశ పడ్డాడు. వెంటనే తన తండ్రి వాచ్ నుంచి అతనికి మరోసారి సందేశం వచ్చింది. ఆయన సేక్రేడ్ హార్ట్ మెడికల్ సెంటర్‌లో ఉన్నట్టు వాచ్ అలర్ట్ ఇచ్చింది. బర్డెట్ ఆస్పత్రికి చేరుకుని తన తండ్రిని కలుసుకున్నాడు. తండ్రి చిన్న గాయాలతో బయటపడటంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఆపిల్ కంపెనీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ పర్వతారోహణ సమయంలో జరిగిన అనుభవాలను ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. అతని పోస్ట్ కథనం ఇలా ఉంది.
ఫేస్‌బుక్‌లో పోస్ట్
పర్వతారోహణ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నాన్న బైక్‌నుంచి పడిపోయాడు. కిందపడటంతో ఆయన తలకు బలమైన గాయమైంది. దాంతో ఆయన చేతికున్న ఆపిల్ వాచ్‌లో గల ‘‘హార్డ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్’’(hard fall detection feature) అత్యవసర నెంబర్ 911కు కాల్ కనెక్ట్ చేసింది. సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్‌లో అక్కడికి చేరుకుని నాన్నకు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం ఆస్పత్రికి చేర్చి సత్వర వైద్య చికిత్స చేశారు. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని బర్డెట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇదంతా ఆపిల్ వాచ్‌లో సెట్ చేయబడిన హార్డ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ వల్లే సాధ్యమైందని, ప్రతి ఒక్కరూ తమ పరికరాల్లో ఈ ఫీచర్‌ను సెట్ చేసుకోవాలని కోరారు.
ఈ ఫీచర్ ఎక్కడుందా అని ఇప్పుడు చాలామంది నెటిజన్లు వెతుకుతున్నారు. మీ దగ్గర ఆపిల్ వాచ్ ఉంటే ఆ ఫీచర్ ఇలా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మీ ఆపిల్ ఐఫోన్ నుండి ఆపిల్ వాచ్ యాప్ ( Apple Watch app ) ఓపెన్ చేయండి. అక్కడ కనిపించే మై వాచ్ టాబ్ ( My Watch tab) ని ప్రెస్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ( Emergency SOS) కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసినట్లయితే డిటక్షన్ ఆప్ ఆర్ ఆన్ ( Detection on or off) అనే ఆప్సన్లు కనిపిస్తాయి. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటుగా 65 సంవత్సరాలు ఉన్నవారికి హెల్త్ యాప్ లో ఈ ఫీచర్ ఆటోమేటిగ్గానే ఎనేబుల్ అవుతుంది.