Bharti Airtel. (Photo Credits: Twitter)

Mumbai, June 5: దేశీయ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో (Bharti Airtel) దాదాపు 2 బిలియన్‌ డాలర్ల (రూ.15 వేల కోట్ల) విలువైన వాటాను కొనుగోలుచేసేందుకు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) చర్చలు జరుపుతున్నట్టు వస్తున్న వార్తలపై భారతి ఎయిర్‌టెల్‌ స్పందించింది. ఎయిర్‌టెల్‌ ఈ రూమర్లను (Airtel on Amazon deal report) కొట్టి పారేసింది. ఇటువంటి ఊహాగానాలు అనవసరమైన పరిణామాలకు దారి తీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమైన అంశాలపై కంపెనీల స్పష్టమైన వివరణ లేకుండానే ఇలాంటి నివేదికలు వెలువడటం విచారకరమని వ్యాఖ్యానించింది. జియోలోకి భారీగా పెట్టుబడులు, నెరవేరుతున్న ముకేష్ అంబానీ లక్ష్యం, 1.85 శాతం వాటాను కొనుగోలు చేసిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్

ఇలాంటి అంచనాలతో స్టాక్ ధర ప్రభావితమవుతుందని, తద్వారా తమ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొంది. ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎయిర్‌టెల్ స్పష్టత ఇవ్వడంతో శుక్రవారం నాటి మార్కెట్ లో కంపెనీ షేరు 2 శాతానికి పైగా ఎగిసింది. అటు భారతి ఎయిర్‌టెల్‌లో వాటాలు కొనుగోలు వార్తలపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి ఇప్పటికే తిరస్కరించారు. భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నాం అనే ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమన్నారు. కాగా అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.