New Delhi, JAN 26: గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ (Google Chrome) వాడుతున్న విండోస్, మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్‌లో రెండు తీవ్రస్థాయిలో లోపాలు ఉన్నాయని.. అవి హ్యాకర్స్‌కు అవకాశంగా మారే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) పేర్కొంది. పీసీలు, ల్యాప్‌టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్‌తో పాటు మాక్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్మార్ట్ ఫోన్స్ యూజర్స్‌కు దాంతో పెద్దగా నష్టం ఉండకపోవచ్చని చెప్పింది. గూగుల్ క్రోమ్‌లోని లోపాలతో (Google Chrome Bug) ఆయా కంప్యూటర్స్ హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉంటుందని.. దాంతో సమాచారాన్ని తస్కరించే అవకాశాలుంటాయని సెర్ట్ తెలిపింది.
హ్యాకర్స్ నుంచి తప్పించుకునేందుకు యూజర్లు తప్పనిసరిగా.. గూగుల్ క్రోమ్‌ని అప్‌డేట్ చేయాలని సూచించింది. క్రోమ్ సెక్యూరిటీ ప్యాచ్‌లు వస్తే.. వెంటనే అప్‌డేట్ చేయాలని చెప్పింది. ముఖ్యంగా.. 132.0.6834.83/8r, 132.0.6834.110/111కు ముందు వెర్షన్ గూగుల్ క్రోమ్‌ని వాడుతున్నట్లయితే తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సిందేనని సెర్ట్ చెప్పింది. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ యూజర్లు 132.0.6834.110 వెర్షన్‌కు ముందు క్రోమ్ వాడుతున్నట్లయితే.. లేటెస్ట్ వెర్షన్‌కు మారాలని పేర్కొంది.