టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు డాట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్ రికార్డింగ్ డాటాను, ఇంటర్నెట్ యూసేజ్ డాటాను రెండేళ్ల పాటు (keep all call, IP records for two years ) భద్రపర్చాలంటూ తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా గతంలో ఈ సమయం ఏడాది పాటే ఉన్నప్పటికీ భద్రతా ఏజెన్సీలు కోరితే ఆ గడువును పెంచే విధంగా సవరణ వెసులుబాటు ఉండేది. అయితే సవరణ గతంలో ఎప్పుడూ జరగలేదు.
ఈసారి మాత్రం రెండేళ్లపాటు భద్రపర్చాలంటూ యునిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్‌కు సవరణ చేసింది. రెండేళ్లపాటు లేదంటే ప్రభుత్వం చెప్పేవరకు వివరాలను భద్రపర్చి ఉంచాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) డిసెంబర్ 21న ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టెలికామ్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం లైసెన్స్‌లు కలిగిన ఇతరులు.. కమర్షియల్‌తో పాటు యూజర్ల కాల్ వివరాల రికార్డ్‌లను భద్రపర్చాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. భద్రతా ఏజెన్సీలు కోరినందునే ఈసారి ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది.
సాదారణంగా ప్రజాప్రయోజనాల దృష్ట్యా లేదంటే భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని టెల్కోస్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం ఈ తరహా ఆదేశాల్ని జారీ చేస్తుంటుంది. కాల్ రికార్డింగులు, మెసేజ్‌ల వివరాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఈ-మెయిల్, లాగిన్, లాగ్ అవుట్.. ఇలా అన్ని వివరాలను జాగ్రత్త పర్చాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ వివరాలకు అదనంగా ఈసారి ఇంటర్నెట్ టెలిఫోనీ(యాప్‌ల ద్వారా చేసే కాల్స్, వైఫై కాల్స్ తదిరత వివరాలు) సైతం రెండు సంవత్సరాలపాటు భద్రపరచాల్సి ఉంటుంది. దర్యాప్తు, విచారణ, భద్రతా ఏజెన్సీలు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ వివరాల్ని కంపెనీలు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది.