Facebook has begun hiding likes ( File image)

October 1:  సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ (Facebook) అంటే తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దానిని ఇన్‌స్టాల్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. అందులోని ప్రతి ఫీచర్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే టెక్నాలజీకి అనుగుణంగా ఫేస్‌బుక్ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే యూజర్లకు మరో ఝలక్ ఇచ్చేందుకు ఫేస్‌బుక్ రెడీ అయింది. ఇకపై ప్రతి శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్టులకు సంబంధించి లైక్స్‌ని హైడ్ చేయనుంది. ప్రతి శుక్రవారం కేవలం పోస్ట్ పెట్టినవారికి మాత్రమే లైక్స్ కనిపించే విధంగా మార్పులు తీసుకురానుంది. ఒకవేళ యూజర్లు ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే ఎన్ని లైక్స్ వచ్చాయి అలాగే ఎన్ని వ్యూస్ వచ్చాయనేది కేవలం పోస్ట్ పెట్టిన వారికి మాత్రమే కనిపించేలా కొత్త మార్పులను తీసుకురానుంది. ఈ టెస్ట్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రారంభం అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా దిగ్గజం అధికారికంగా ప్రకటించింది. కాగా యాడ్స్ కూడా ఇందులో భాగం కానున్నాయని తెలుస్తోంది. మేము దీనిపై పరిమితంగా టెస్ట్‌లు చేస్తున్నామని లైకులు, కామెంట్లు, వ్యూస్ అన్ని ప్రైవేటుగా ఉంచేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని ఫేస్‌బుక్ అధికారి ప్రతినిధి తెలిపారు.

ఈ అంశంపై యూజర్ల అనుభవాన్ని సేకరిస్తున్నామని, వారి రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. కాగా సెప్టెంబర్ నెలలో ఈ దిగ్గజం తన సొంత ఫ్లాట్ ఫాం అయిన ఇన్‌స్టా‌గ్రామ్‌లో కూడా దీనిపై ప్రయోగాలు చేసింది. అందులో లైక్స్ ని కనిపించకుండా చేసింది. ఇన్‌స్టా గ్రామ్‌లో పలు మార్పులు చేస్తున్నామని, యూజర్లు పెట్టిన పోస్ట్ ఎన్ని లైకులు రిసీవ్ చేసుకుంటుందో అనే దాన్ని హైడ్ చేస్తున్నామని గత ఆగస్టులోనే తెలిపింది. ఈ కార్యక్రమాన్ని జులై నెలలో ఏడు దేశాల్లో అమలు చేసింది. ఆస్ట్రేలియా( Australia), కెనడా (Canada), బ్రెజిల్( Brazil), న్యూజీలాండ్( New Zealand),ఐర్లాండ్( Ireland),ఇటలీ(Italy)జపాన్(Japan) వంటి దేశాల్లో ఈ ప్రయోగాన్ని అమలే చేసింది. పోస్టులు పెట్టిన వారికి మాత్రమే కనపడేలా పలు మార్పులు చేసింది. అయితే ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్ల రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.దీనికి కారణం చాలామంది పోస్టుల్లో తమకు ఎన్ని లైకులు , కామెంట్లు వచ్చాయో చూసుకుని మురిసిపోతుంటారు. ఇప్పుడు అవి కనపడకుండా చేస్తే యూజర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.