Facebook-Jio Deal (Photo-getty)

Mumbai, April 22: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీగా పెట్టుబడి (Facebook-Jio Deal) పెట్టింది. మొత్తం 5.7 బిలయన్‌ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్‌బుక్‌ (Facebook) బుధవారం ప్రకటించింది. దీంతో జియోలో (Reliance Jio) 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసినట్లయింది. తద్వారా ఫేస్‌బుక్‌​ జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్టు అయింది.

ఫేస్‌బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలోని టెక్నాలజీ రంగంలో ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ అని రిలయన్స్‌ తెలిపింది. ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం వల్ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై భారీగా అప్పుల భారం తగ్గనుంది. ఈ డీల్ తర్వాత తమ మెసేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌, రిలయన్స్‌కు చెందిన ఈ-కామర్స్‌ వెంచర్‌ జియో మార్ట్‌తో కలిసి ప్రజలు చిన్న వ్యాపారాలతో కనెక్ట్ అయ్యేలా దృష్టి సారించనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఇండియాలో డిజిటల్ మార్కెట్లో తన పరిధిని మరింతగా విస్తరించుకునేందుకు ఫేస్‌బుక్‌ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే రిలయన్స్‌ జియోలో భారీగా పెట్టుబడి పెట్టింది.

జియోలో పెట్టుబడిపై ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ.. ‘భారత్‌లో ప్రజలకు వాణిజ్య పరమైన అవకాశాలు కల్పించేలా రిలయన్స్‌తో కలిసి పనిచేయనున్నాం. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు ఇండియాలో భారీ సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. భారత్‌లో దాదాపు 60 మిలియన్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయి. వీరందరికీ వాణిజ్య అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ భాగస్వామ్యం కల్పించిన ముఖేశ్‌ అంబానీ, జియో టీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు.

2016లో దేశంలో అధికారికంగా సేవలను ప్రారంబించిన రిలయన్స్ జియో వేగంగా అభివృద్ధి చెంది భారతీయ టెలికాం మార్కెట్లోకి టాప్ లోకి దూసుకు వచ్చింది. మొబైల్ టెలికాంతోపాటు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఈ-కామర్స్ వరకు ప్రతిదానికీ విస్తరించింది. అంతేకాదు యుఎస్ టెక్ గ్రూపులతో పోటీ పడగల ఏకైక సంస్థగా రిలయన్స్ అవతరించింది. గత నెలలోనే ఫేస్‌బుక్‌.. రిలయన్స్‌ జియో 10 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసింది.

వాట్సాప్‌కు భారత్‌లో 400 మిలియన్ల యూజర్స్‌ ఉన్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించేవారిలో 80 శాతం మంది వాట్సాప్‌ను వాడుతున్నారు.