ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు చెందిన డివైస్‌లలో కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ (Gmail, Yahoo Mail, Google Pay Down) అవుతున్నాయి. మన దేశంలోనూ కొందరు యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలోని జీమెయిల్ యాప్ (Gmail App) ఎక్కువగా క్రాష్ అవుతుందని ఫిర్యాదు చేస్తున్నారు. ఫలానా యాప్‌కు చెందిన నోటిఫికేషన్‌ను క్లిక్ చేసినప్పుడు యాప్ ఓపెన్ అవ్వడంలేదు. తరుచుగా క్రాష్ అవుతున్న యాప్స్‌లో గూగుల్‌పే, జీ మెయిల్, క్రోమ్ కూడా ఉన్నాయి.
అయితే ఈ సమస్యకు గల కారణాన్ని గూగుల్ వెంటనే పసిగట్టింది. ఈ సమస్య వోఎస్‌లోని ఆండ్రాయిడ్ వెబ్ వ్యూ యాప్ (Android Web APP) ద్వారా ఏర్పడిందని గూగుల్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఆండ్రాయిడ్ యూజర్లు (Android users) తమ ఫోన్లలో జీమెయిల్‌ను ఓపెన్ చేయలేకపోతున్నారని, ఓపెన్ చేసినా యాప్ క్రాష్ అవుతుందని తాము గుర్తించామని గూగుల్ (Google) తెలిపింది. గూగుల్ అప్‌డేట్ రిలీజ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంతలోపు యూజర్లు వెబ్‌వ్యూ అప్‌డేట్‌ను తొలగించి స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ చేస్తే చాలు. తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుందని గూగుల్ తెలిపింది.
అయితే యూజర్లు తాత్కాలికంగా ఫోన్లలో జీమెయిల్‌కు బదులుగా డెస్క్‌టాప్‌లో జీమెయిల్‌ను ఉపయోగించాలని కోరింది. తాము ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మొబైల్ ఫోన్లనే ఎక్కువశాతం వినియోగదారులు వాడుతున్నారు. ఫలానా బ్రాండ్ అనే తేడా లేకుండా అన్ని ఆండ్రాయిడ్ మొబైల్‌ఫోన్లలో ఈ సమస్య ఏర్పడింది. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్లు ఎక్కువగా యాప్ క్రాష్ సమస్యకు గురైయ్యాయి. ఈ సమస్య మరింత జటిలం కావడంతో శాంసంగ్ తన యూజర్లను వెబ్ వ్యూ యాప్‌ను ఆన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది.
ఇక మరోవైపు దీనిపై శాంసంగ్ కూడా స్పందించింది. శాంసంగ్ ఫోన్లను వాడుతున్న యూజర్లు ఒక సెట్టింగ్ చేస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని ఆ సంస్థ తెలిపింది. అందుకు గాను యూజర్లు ఫోన్‌లో ఉండే సెట్టింగ్స్‌లోని యాప్స్ అనే విభాగంలోకి వెళ్లి అక్కడ పై భాగంలో కుడివైపు కార్నర్‌లో ఉండే మూడు డాట్స్‌పై ట్యాప్ చేయాలి. తరువాత షో సిస్టమ్ యాప్స్ అనే ఆప్షన్‌లో ఉండే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూలోని అన్ఇన్‌స్టాల్ అప్‌డేట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చని శాంసంగ్ తెలిపింది.
శాంసంగ్ సపోర్ట్ పలు సూచనలు
వెబ్‌వ్యూ ఆప్‌డేట్‌ను ఆన్‌ఇన్‌స్టాల్ చేసి, తిరిగి ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయమంది. తరువాత ఈ స్టెప్‌లను ఫాలో అవ్వండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. పక్కన కనిపించే త్రీ డాట్స్‌ను క్లిక్ చేసి షో సిస్టమ్ యాప్స్ లో ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ లోకి వెళ్లి..అన్‌ఇన్‌స్టాల్ ఆప్‌డేట్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. శాంసంగ్ యూజర్లు మాత్రమే కాకుండా అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఈ విధంగా చేస్తే యాప్ క్రాష్ సమస్యనుంచి తప్పించుకోవచ్చు. అయితే వెబ్‌వ్యూ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అప్రమత్తత అవసరమని కూడా హెచ్చరించింది.