WhatsaApp (Photo Credits: Pxfuel)

వాట్సాప్ వినియోగదారులకు ఉపయోగపడే వార్త, ఇకపై నేరుగా మీ వాట్సాప్ నుంచి కూడా మీ కాంటాక్ట్స్ లిస్టులో ఉన్నవారికి నగదు పంపించుకోవడం, పొందడం లాంటి వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. అనేక చట్టపరమైన అడ్డంకులను అధిగమించిన తర్వాత వాట్సాప్ ద్వారా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. తొలుత 20 మిలియన్ల వినియోగదారులకు ఈ సేవను అందించడానికి అనుమతించబడింది. చెల్లింపుల కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

యుపిఐ ఆధారంగా పనిచేస్తుంది: వాట్సాప్ పే అనేది వినియోగదారులకు వారి కాంటాక్ట్ లిస్టులోని వారితో లావాదేవీలు చేయడానికి అనుమతించే ఇన్-చాట్ పేమేంట్ ఫీచర్ కలిగి ఉండేది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ఆధారంగా ఇది పనిచేస్తుంది, ఇది అచ్ఛంగా గూగుల్ పే, ఫోన్ పే, బిహెచ్ఐఎం మరియు బ్యాంకుల వివిధ అనువర్తనాలు ఉపయోగించే వ్యవస్థ. కాబట్టి మీరు వాట్సాప్ ‘వాలెట్’ లో డబ్బును నిల్వ చేసుకోనవసరం లేదు. డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుంచే ఇతర వ్యక్తులకు బదిలీ చేయడానికి ఇది ఒక ప్లాట్‌ఫాంలా సహాయపడుతుంది. వాట్సాప్ లో పేమేంట్స్ కోసం రిజిస్టర్ చేసుకొన్నప్పుడు దీనికోసం మరొక కొత్త యుపిఐ ఐడి సృష్టించబడుతుంది. ఈ యాప్ యొక్క ‘పేమేంట్స్’ విభాగానికి వెళ్లి ఈ ID ని గుర్తించవచ్చు.

నమోదు: వాట్సాప్‌లో చెల్లింపులను ప్రారంభించడానికి మీకు బ్యాంక్ ఖాతా మరియు దానికి అనుసంధానమైన ఫోన్ నంబర్‌ను కలిగి ఉండాలి. ఫోటోలు, వీడియోలు మొదలైనవాటిని పంపడానికి మీరు సాధారణంగా ఉపయోగించే స్క్రీన్ దిగువన ఉన్న 'అటాచ్మెంట్స్' చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. మొదట రిజిస్ట్రేషన్ చేయమని వాట్సాప్ మిమ్మల్ని నిర్దేశిస్తుంది మరియు ఫోన్ కాల్స్ చేయడానికి అలాగే సందేశాలను చదవడానికి అనుమతి అడుగుతుంది. ఇందులో రిజిస్టర్ చేసుకోటానికి మీరు యుపిఐ పాస్‌కోడ్‌ను కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇదివరకే మరేదైనా యాప్ ద్వారా యుపిఐ పాస్ కోడ్ కలిగి ఉంటే, అదే కోడ్ ఇక్కడా ఉపయోగించవచ్చు.

వాట్సాప్ పేమెంట్స్ ఖాతాను ఎలా సృష్టించాలి?

స్టెప్ 1: మొదట వాట్సాప్ యొక్క తాజా వెర్షన్‌ను అప్ డేట్ చేయండి. అనంతరం వాట్సాప్ ఒపెన్ చేసి, స్క్రీన్ కుడివైపు ఎగువన మూలలో ఉన్న మూడు-చుక్కల చిహ్నంపై క్లిక్ చేయండి.

స్టెప్ 2: పేమెంట్స్ పై క్లిక్ చేయండి మరియు చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.

స్టెప్ 3: మీ బ్యాంక్ పేరును ఎంచుకున్న తరువాత, బ్యాంకుకు లింక్ చేయబడిన మీ మొబైల్ నెంబర్ ధృవీకరించబడుతుంది. దీని కోసం, మీరు SMS ద్వారా కన్ఫర్మ్ చేయాలి. మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడిన వాట్సాప్ నంబర్ ఒకటేనని నిర్ధారించుకోండి.

స్టెప్ 4: ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీరు చెల్లింపును సెటప్ చేయాలి. ఇతర అనువర్తనాల మాదిరిగానే, లావాదేవీని నిర్వహించడానికి యుపిఐ పిన్ ఏర్పాటు చేయాలి. దీని తరువాత, మీరు చెల్లింపు పేజీలో ఎంచుకున్న బ్యాంకును చూడగలరు.

వాట్సాప్‌తో ఎలా చెల్లించాలి?

స్టెప్ 1: వాట్సాప్‌లో వ్యక్తి యొక్క చాట్‌ను ఒపెన్ చేయండి, దాని నుండి డబ్బు లావాదేవీలు జరపాలి. ఇక్కడ అటాచ్మెంట్ చిహ్నానికి వెళ్లండి.

స్టెప్ 2: అప్పుడు పేమెంట్ పై క్లిక్ చేయండి మరియు మీరు పంపించదలిచిన మొత్తాన్ని నమోదు చేయండి.

స్టెప్ 3: వాట్సాప్ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయడానికి మీ యుపిఐ పిన్ ఎంటర్ చేయండి. లావాదేవీ పూర్తయిన తర్వాత, మీకు నిర్ధారణ సందేశం వస్తుంది.

మే గణాంకాల ప్రకారం, వాట్సాప్ భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది, ఇతర గూగుల్ పే మరియు ఫోన్‌పే లాంటి యాప్స్ 60 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్నాయి. గత రెండేళ్లుగా ఇండియాలో వాట్సాప్ పేమేంట్స్ సేవను ప్రారంభించడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్ ద్వారా చెల్లింపు సేవలను ప్రవేశపెట్టడంతో భారతదేశంలో డిజిటల్ చెల్లింపు ధోరణి వేగంగా పెరుగుతుందని ఈ రంగానికి సంబంధించిన కంపెనీలు అభిప్రాయపడ్డాయి.