November 1: భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్’అనే స్పైవేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ వాట్సప్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. దీంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి గూఢచర్యం నెరిపిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్ స్పైవేర్ పెగాసస్ ద్వారా ఆయా వ్యక్తుల వాట్సప్ ఖాతాల్లో ఎలాంటి సమాచారం మార్పిడి అవుతుందో నిఘా పెట్టారని వాట్సప్ సంస్థ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.
ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని ఈ సమాచార చోరీ జరిగినట్లు గుర్తించింది. దీనికి సంబంధించి ఎన్‌ఎస్‌వో కంపెనీపై అమెరికాలో వాట్సప్ ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. దీనిపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మొత్తం వ్యవహారంతోపాటు, భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సప్‌ను కేంద్రం ఆదేశించింది. జర్నలిస్టులు, విద్యావేత్తలు, దళిత, మానవ హక్కుల కార్యకర్తలు ఇలా కనీసం 24మందికిపైగా వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అనే నిఘా సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ను గుర్తు తెలియని సంస్థలకు అప్పగించిందని, దీని సాయంతో నాలుగు ఖండాల్లోని సుమారు 1,400 మంది దౌత్యాధికారులు, రాజకీయ అసమ్మతివాదులు, జర్నలిస్టులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెందిన ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని వాట్సప్ తెలిపింది. అయితే భారత్‌లో బాధితుల వివరాలు తెలిపేందుకు వాట్సప్ నిరాకరించింది. కాగా ఈ సైబర్ అటాక్ బారిన పడినట్టు భావిస్తున్న దాదాపు 1400మంది యూజర్లకు ప్రత్యేక వాట్సాప్ మెసెజ్ ద్వారా సమాచారమిచ్చాం’ అని ఫేస్‌బుక్ తెలిపింది. దీనిపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై వాట్సప్ కేసు వేసింది.