ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి నాంది పలకనుంది. భారీ ఎత్తున లోకాస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి (Low Cost Phones from Jio) సిద్ధమవుతోందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ద్వారా తక్కువ రేటుతో కూడిన 10 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ల తయారు (10 Crore Low-Cost Phones) చేయనుందని సమాచారం. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌లలో డేటాప్యాక్ లను కూడా అదనంగా అందించాలని భావిస్తోంది.
బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం డేటా ప్యాక్‌లతో కూడిన100 మిలియన్లకు పైగా ఫోన్‌లను 2020 డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయనుంది. జియో కోసం "4 జీ లేదా 5 జీ" స్మార్ట్‌ఫోన్‌లకోసం గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను (Android operating system (OS)నిర్మిస్తోందని ఇటీవల రిలయన్స్ అధినేత బిలియనీర్ ముకేశ్ అంబానీ ప్రకటించడం గమనార్హం. తద్వారా దేశీయ టెలికాం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ సారధ్యంలోని జియో స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలోతన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ తన డిజిటల్ యూనిట్లో 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు జూలైలో రిలయన్స్ (Reliance Industries) ప్రకటించింది. జియో ప్లాట్‌ఫామ్‌లలో (Jio) దాదాపు 33 శాతం వాటా విక్రయం ద్వారా 1.52 ట్రిలియన్ డాలర్లు (20.22 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులను సాధించింది. ఫేస్‌బుక్, ఇంటెల్, క్వాల్కమ్‌లతో సహా ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను సాధించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లోఅమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. తాజాగా ఈ కోవలో మరో దిగ్గజం సంస్థ కేకేఆర్ చేరింది. సుమారు 1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు కేకేఆర్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నట్టు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ నెలలోనే ఒక ప్రకటన రావచ్చు అని పేర్కొంది. అయితే అంచనాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.