New Delhi, July 9: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తాజాగా 'జెడ్ 61 ప్రో' అనబడే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. లావా జెడ్ 61 ప్రో అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలోనే తయారు చేయబడిన స్మార్ట్‌ఫోన్ అని సంస్థ ప్రకటించింది. భారత్ మరియు చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో భారతీయ ఉత్పత్తుల పట్ల డిమాండ్ పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని లావా సంస్థ అన్ని మెరుగైన ఫీచర్లతో, బడ్జెట్ ధరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. లావా జెడ్ 61 ప్రో ధరను రూ. 5.774/- గా సంస్థ నిర్ణయించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, లావా జెడ్ 61 ప్రో 5.45-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేను 18: 9 నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి స్టోరేజ్ సామర్థ్యాన్ని 128GB వరకు విస్తరించుకోవచ్చు. వీటన్నింటికీ 3,100 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉంది.
కెమెరా విషయానికి వస్తే, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ ఉంది. కెమెరాలోని లక్షణాల విషయానికొస్తే, పోర్ట్రెయిట్ మోడ్ (బోకె), బర్స్ట్ మోడ్, పనోరమా, ఫిల్టర్లు, బ్యూటీ మోడ్, హెచ్‌డిఆర్ మరియు నైట్ మోడ్‌తో వస్తుంది.
లావా జెడ్ 61 ప్రో స్మార్ట్‌ఫోన్ 'మిడ్నైట్ బ్లూ' మరియు 'అంబర్ రెడ్' అనే 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేసేందుకు వీలుగా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు సంస్థ పేర్కొంది.