Lenovo Transparent Laptop: స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024 ఈవెంట్ జరుగుతుంది. వివిధ ఎలక్ట్రానిక్- టెక్ కంపెనీలు ఈ ఈవెంట్‌లో తమ బ్రాండ్ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి, అయితే ఈ గ్లోబల్ ఈవెంట్ సందర్భంగా లెనొవొ కంపెనీ ప్రదర్శించిన ఒక డివైజ్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. లెనొవొ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి పారదర్శక ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది.
Lenovo ThinkBook పేరుతో ఆవిష్కరించిన ఈ ల్యాప్‌టాప్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంటే ఈ ల్యాప్‌టాప్ నుంచి అవతలివైపు దృశ్యాన్ని కూడా చూడవచ్చు. చూడటానికి అద్దంలా కనిపిస్తుంది, కానీ ఇది నిజానికి 17.3-అంగుళాల మైక్రో-LED పారదర్శక స్క్రీన్. థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ కాన్సెప్ట్‌లో భాగంగా నిర్ధిష్ట పరిమాణం అంటూ ఉండని పారదర్శకమైన స్క్రీన్, పారదర్శక ఫ్లాట్ టచ్ కీబోర్డ్, ఫ్లోటింగ్ ఫుట్‌ప్యాడ్ డిజైన్‌లను లెనొవొ పరిచయం చేసింది.
ఈ Lenovo ThinkBook ల్యాప్‌టాప్ 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో బార్డర్‌లెస్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అదేవిధంగా పారదర్శకమైన కీబోర్డ్ కలిగి ఉంది. వివిధ టాస్క్‌లను పూర్తి చేయడానికి ఈ ల్యాప్‌టాప్ కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌కు సపోర్ట్ చేసే ఒక పెన్ రూపొందించారు, ఇది కీబోర్డ్ నుంచి కాకుండా నేరుగా పెన్ ద్వారా డ్రాయింగ్ బోర్డుకు మారే వెసులుబాటు కల్పిస్తుంది. కాబట్టి వివిధ డిజైన్లను రూపొందించే వారికి ఈ సరికొత్త కాన్సెప్ట్ ల్యాప్‌టాప్ సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ ల్యాప్‌టాప్‌తో పాటు లెనొవొ ఇంకా ThinkVision M14t Gen 2 పోర్టబుల్ మొబైల్ మానిటర్, థింక్‌ప్యాడ్ మరియు థింక్‌బుక్ బిజినెస్ ల్యాప్‌టాప్‌ల యొక్క కొత్త లైనప్‌ను పరిచయం చేసింది. థింక్‌ప్యాడ్ లైనప్‌లో థింక్‌ప్యాడ్ T14 i Gen 5, థింక్‌ప్యాడ్ T14s Gen 5, థింక్‌ప్యాడ్ T16 Gen 3, ThinkPad X12 డిటాచబుల్ Gen 2, మరియు ThinkBook 14 2-in-1 Gen 4 ఉన్నాయి. ఇవన్నీ సరికొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందుతాయి, అలాగే మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆధారంగా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది.
అయితే, ఈ ట్రాన్స్‌పరెంట్ ల్యాప్‌టాప్ యొక్క హార్డ్‌వేర్-సంబంధిత పూర్తి స్పెసిఫికేషన్‌లను లెనొవొ వెల్లడించలేదు. వీటి ధరలను కూడా కంపెనీ వెల్లడించలేదు. ఇప్పట్లో ఈ సరికొత్త కాన్సెప్ట్ ల్యాప్‌టాప్ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం కూడా లేదని అంటున్నారు. కానీ రాబోయే ఐదేళ్లలో ఇలాంటి టెక్నాలజీ కలిగిన ల్యాప్‌టాప్‌లు, ఇతర ఉత్పత్తులు వచ్చే అవకాశం కచ్చితంగా ఉందని లెనొవొ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టామ్ బట్లర్ ఆశాభావం వ్యక్తం చేశారు.