New Delhi, Mar 30: ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్ యూజర్లకు షాకిచ్చింది. లక్షలమంది మొబీక్విక్ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారన్న వార్తలు (MobiKwik Data Leaked) మొబీక్విక్ వినియోగదారుల్లో ప్రకంపనలు రేపింది. 35 లక్షల మంది మొబిక్విక్ వినియోగదారుల సమస్త సమాచారాన్ని డార్క్ వెబ్ లో అమ్మకానికి (MobiKwik Data Leak) పెట్టారంటూ రాజశేఖర్ రాఝరియా అనే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు బాంబు పేల్చారు. చరిత్రలో ఇదే అతిపెద్ద ‘కేవైసీ డేటా లీక్’ (MobiKwik Data Breach) అని ఎలియట్ ఆండర్సన్ అనే మరో రీసెర్చర్ అన్నారు.
కేవైసీ సహా అన్ని వివరాలను డార్క్ వెబ్ లో పెట్టారని వెల్లడించారు. ఆధార్, పాన్, చిరునామా, ఫోన్ నంబర్లు, ఫోన్ వివరాలు, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న యాప్ ల పాస్ వర్డ్ లు, ఐపీ అడ్రస్, జీపీఎస్ లొకేషన్ల వంటి వివరాలు మొబిక్విక్ సర్వర్ నుంచి లీకైనట్టు టెక్ నాడు అనే సంస్థ వెల్లడించింది. దాదాపు 8.2 టీబీల డేటా ఉన్నట్టు చెప్పింది. ఎవరైనా తమ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా వివరాలను చెక్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇటు వినియోగదారులు కూడా తమ డేటా డార్క్ వెబ్ లో ఉన్నట్టు గుర్తించి షాక్ తిన్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. కాగా, డేటా లీకైన విషయాన్ని గత ఫిబ్రవరిలోనే రాజశేఖర్ రాఝరియా వెల్లడించారు. దాదాపు 11 కోట్ల మంది భారతీయుల సమాచారం డార్క్ వెబ్ లో లీకైందన్నారు. ఆరు టెర్రాబైట్ల కేవైసీ డేటా, 350 జీబీల కంప్రెస్డ్ డేటా డార్క్ వెబ్ లో ఉన్నట్టు చెప్పారు.
Here's Leak Update
Indian payment systems giant "Mobikwik" allegedly suffered what may be considered the largest KYC data leak in history.
Over 37m files, KYC of 3.5m individuals, and a whopping 100m phone numbers, emails, passwords, geodata, bank accounts & CC data.@MobiKwik pic.twitter.com/dCFqTHEv1F
— Alon Gal (Under the Breach) (@UnderTheBreach) March 28, 2021
అయితే, అప్పట్లో వచ్చిన ఈ ఆరోపణలను మొబిక్విక్ ఖండించింది. తాజాగా సోమవారం యూజర్లే స్వయంగా తమ డేటా లీకైనట్టు ప్రకటించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరి సమాచారాన్ని 1.5 బిట్ కాయిన్లు లేదా 86 వేల డాలర్లకు మొబిక్విక్ అమ్ముకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలనూ సంస్థ తోసిపుచ్చింది. వార్తల్లో ఉండాలనుకునే కొందరు సెక్యూరిటీ రీసెర్చర్లు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు ఇటు సంస్థ సమయం, అటు మీడియా సమయాన్ని వృథా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తమ దగ్గర ప్రతి వినియోగదారుడి డేటా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. నిధుల సమీకరణలో భాగంగా భారీ ఐపీఓకి ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ డేటాబ్రీచ్ వార్తలతో మొబీక్విక్ ఇబ్బందుల్లో పడింది.