Mobile Tariff Hike: వినియోగదారులకు షాకిచ్చిన టెల్కోలు, డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు పెంపు, ఇప్పటికే కాల్ రేట్లు వసూలు చేస్తున్న రిలయన్స్ జియో
Mobile call, data to cost more as Vodafone-Idea, Airtel to hike rates from December (Photo-ANI)

Mumbai, November 19: టెలికామ్ వినియోగదారులకు వోడాఫోన్-ఐడియా (Vodafone-Idea), ఎయిర్‌టెల్ (Airtel) సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. డిసెంబర్ 1 నుండి మొబైల్ సేవా రేట్లను పెంచనున్నామని (Mobile call, data to cost more) ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ టెలికాం కంపెనీలు మొబైల్ సర్వీసు రేట్లను డిసెంబర్ 1 నుంచి పెంచాలని నిర్ణయించాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

రిలయన్స్ జియో ( Reliance jio) ఇప్పటికే ఈ జాబితాలో ముందుంది. ప్రస్తుతం జియో నుంచి జియోకి కాకుండా..ఇతర నెట్‌వర్కులకు చేసే కాల్స్‌కు ప్రతి నిమిషానికి 6 పైసలు చొప్పున జియో వసూలు చేస్తోంది. దీంతో పాటు కాల్ ఛార్జీలు పెంచేందుకు ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా డిసైడయ్యాయి.

గ్లోబల్ డిజిటల్ అనుభవం కోసం కంపెనీ వినియోగదారులకు డిసెంబర్ 1 నుండి చార్జీలను పెంచుతున్నట్టు వోడాఫోన్ ఐడియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రతిపాదిత చార్జీలకు సంబంధించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వ్యాపారం వృద్ధికి వీలుగా డిసెంబర్ నుంచి కంపెనీ సేవల రేటును పెంచడం ప్రారంభిస్తున్నామని భారతి ఎయిర్‌టెల్ కూడా ప్రకటించింది. టెలికం రంగంలో మూలధనం అవసరం ఉందని, అందులో నిరంతరం పెట్టుబడులు పెట్టాలని సంస్థ తెలిపింది. దీని ప్రకారం ఎయిర్‌టెల్ డిసెంబర్ నుండి సుంకాన్ని పెంచుతుంది.

ఇదిలా ఉంటే వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.50,922 కోట్ల నష్టాన్ని చవిచూసింది. చరిత్రలో ఏ భారతీయ కంపెనీకి ఇంత భారీ స్థాయిలో త్రైమాసిక నష్టం రాలేదు. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్)పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బకాయిలు చెల్లించడానికి కేటాయించిన నిబంధన కారణంగా సంస్థకు ఈ నష్టం వాటిల్లింది. కాగా, టెలికాం రంగంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉందని, తగిన ఉపశమనం ఇవ్వడానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇప్పటికై కనీస ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. డేటా లేకుండా వొడాఫోన్ ఐడియా నెలవారీ మొబైల్ సర్వీస్ కనీస ఛార్జ్ రూ.24 నుంచి ప్రారంభమవుతుండగా, డేటా సర్వీసులతో రూ.33 నుంచి ప్రారంభమవుతుంది. ఎయిర్‌టెల్ (Bharti Airtel) కూడా నెలవారీ ప్లాన్ రూ.24 నుంచి ప్రారంభం అవుతుంది. డేటాతో కూడిన ప్లాన్ రూ.35 నుంచి ప్రారంభం అవుతోంది. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.