టెలికాం రంగంలో సంచలనాలను సృష్టించిన జియో మరో సంచలనానికి రెడీ అయింది. కేవలం రూ. 199కే 1టీబీ డేటా(1000జీబీ)ను జియోఫైబర్ (Reliance Jio Fiber) అందిస్తోంది. యూజర్లకు ఈ డేటా సాచెట్ ట్యాక్స్‌తో కలిపి రూ.234.82రూపాయలకు రానుంది. కాగా డేటా ప్యాక్ (Data Pack) వ్యాలిడిటీ కేవలం ఏడు రోజులు మాత్రమే. 1 టీబీ డేటా 100ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. డేటా ప్యాక్ ముగిసిన తరువాత 1 ఎమ్‌బీపీఎస్ స్పీడ్ వస్తుంది.
తక్కువ ధరలకే ఇంటర్నెట్ డేటాను , ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని యూజర్ల కోసం జియో ప్రవేశపెట్టి టెలికం రంగంలో పెను మార్పులకు నాంది పలికిన విషయం విదితమే. జియో దెబ్బకు పలు మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు దిగివచ్చాయి. గత్యంతరం లేక పలు దిగ్గజ మొబైల్ నెట్‌వర్క్‌లు ఇంటర్నెట్ డేటా ధరలను తగ్గించాయి. ఉచిత కాల్స్‌ను కూడా ప్రవేశపెట్టాయి. 2019 సెప్టెంబర్‌లో జియోఫైబర్‌ను ప్రకటించి రిలయన్స్ మరో సంచలనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పలు నగరాల్లో ప్రవేశపెట్టింది.
జియోఫైబర్‌తో పలు ఓటీటీ సేవలను, ఉచిత హెచ్‌డీ వాయిస్ కాల్స్, హై స్పీడ్ ఇంటర్నేట్, టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, సెక్యూరిటీ సేవలను యూజర్లకు అందిస్తోంది. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో 999,1499,2499 డేటా ప్యాక్ లు ఎక్కువగా ప్రజాదరణను పొందాయి. తాజాగా జియో ఫైబర్ తన యూజర్ల కోసం ఈ అద్బుతమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.