Paytm App Removed: గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం యాప్ తొలగింపు, గూగుల్ యొక్క గాంబ్లింగ్ పాలసీకి విరుద్ధంగా పేటీఎం యాప్ వ్యవహరిస్తుందని పేర్కొన్న సెర్చ్ ఇంజన్ దిగ్గజం
Paytm (Photo credit: PTI)

New Delhi, September 18: గూగుల్ ప్లే స్టోర్ నుండి Paytm యాప్ తొలగించబడింది. గూగుల్ ప్లే స్టోర్ యొక్క పాలసీ విధానాలకు విరుద్ధంగా Paytm యాప్ లో గ్యాంబ్లింగ్ లాంటి గేమ్స్ ప్రోత్సహిస్తున్నందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం వెల్లడించింది. దీంతో అండ్రాయిడ్ ఫోన్ లలో Paytm డౌన్ లోడ్ చేసుకోవాలనుకునే వారికి ఆ యాప్ కనిపించడం లేదు. అయితే Paytm యాజమాన్యమైన 'One97 Communications Ltd' గూగుల్ తీసుకున్న ఈ చర్యకు సంబంధించి ఎలాంటి కమెంట్ చేయలేదు.

అండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లో Paytm యాప్ మరియు Paytm ఫస్ట్ గేమ్స్ యాప్ కోసం సెర్చ్ చేస్తే "మమ్మల్ని క్షమించండి, మీరు అభ్యర్థించిన URL ఈ సర్వర్‌లో కనుగొనబడలేదు" అని ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. కాకపోతే Paytm యొక్క అనుబంధ యాప్స్ అయినటువంటి పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ మొదలగు సిస్టర్ యాప్స్ మాత్రం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పేటీఎం తన యాప్ లో 'ఫాంటసీ క్రికెట్ టోర్నమెంట్' ను అదనంగా చేర్చింది. అయితే పేటీఎం యాప్ లో కొత్తగా చేర్చబడిన ఈ గేమ్ బెట్టింగ్స్ ను ప్రోత్సహించేలా ఉందని, ఈ తరహా జూదం లాంటి గేమ్స్ కు గూగుల్ మద్ధతు ఇవ్వదని తెలుపుతూ పేటీఎం యాప్ ను తొలగించినట్లు ధృవీకరించింది.  గూగుల్ తమ యొక్క గాంబ్లింగ్ పాలసీ విధానాలను హైలైట్ చేసిన బ్లాగ్ పోస్ట్‌ను శుక్రవారం ప్రచురించింది.

Here's a tweet by one of the journalist:

“మేము ఆన్‌లైన్ కాసినోలను అనుమతించము లేదా స్పోర్ట్స్ బెట్టింగ్‌ను ప్రోత్సహించే యాప్స్ కు మద్దతు ఇవ్వము. ఈ తరహా టోర్నమెంట్లు నిజమైన క్రికెట్ బెట్టింగ్ లకు అనుమతించే మరో ఇతర వెబ్ సైట్ కు రీడైరెక్ట్ చేయబడే అవకాశాలు ఉంటాయి. ఇది మా పాలసీ విధానాలకు విరుద్ధం" అని గూగుల్ పేర్కొంది.

అయితే ఇప్పటికే పేటీఎం యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వినియోగదారులు యాప్ యొక్క అన్ని సేవలను వినియోగించుకోవచ్చు.  కానీ కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభించదు. అయితే ఐఓఎస్ (యాపిల్ ఫోన్) యూజర్లకు మాత్రం పేటీఎం యొక్క అన్ని రకాల యాప్స్ మరియు సర్వీసులు యధావిధంగా ఉన్నాయి.