రిలయన్స్ జియో.. భారతి ఎయిర్‌టెల్, వొడాపోన్ ఐడియా బాటలోనే ప్రీపెయిడ్ టారిఫ్స్ 21 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. జియోఫోన్ ప్లాన్ (Reliance Jio) సహా అన్‌లిమిటెడ్ ప్లాన్స్, (వాయిస్, డేటా), డేటా యాడ్ ఆన్ ప్లాన్ల ధరలను 19.6 శాతం నుంచి 21.3 శాతం శ్రేణిలో పెంచినట్లు తెలిపింది. టెలికాం పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులను తట్టుకుని నిలబడటమే కాకుండా మరింత బలోపేతం చేసే ప్రయత్నాలకు అనుగుణంగా మొత్తం 15 ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్ ధరలను (Reliance Jio Tariffs) పెంచినట్లు రిలయన్స్ జియో తెలిపింది.
ప్రస్తుతం టారిఫ్ ధరలను పెంచినప్పటికీ.. అంతర్జాతీయంగా చూస్తే ఇవి ఇప్పటికీ కనిష్ఠ స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది. కాగా భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్ల ధరలతో పోల్చితే జియోఫోన్ కొత్త ప్లాన్ల ధరలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన జియోఫోన్ ఎంట్రీలెవల్ ప్లాన్ (నెలకు 3జీబీ డేటా, అపరిమిత వాయి్‌సకాల్స్) ధరను రూ.75 నుంచి రూ.91కి పెంచింది.
కాగా భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఎంట్రీలెవల్ ప్లాన్ ధర రూ.99 గా ఉంది. కాగా అన్‌లిమిటెడ్ విభాగం లో 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన అతి చవకైన ప్లాన్ ధరను రూ.129 నుంచి రూ.155కి పెంచింది.
ఇదే విభాగంలో అత్యంత ఆదరణ పొందిన 84 రోజుల వ్యాలిడిటీ (రోజుకు 1.5 జీబీ డేటా) ప్లాన్ ధరను 20 శాతం పెంపుతో రూ.555 నుంచి రూ.666కు పెంచినట్లు జియో వెల్లడించింది.