Mukesh Ambani. (Photo Credits: Twitter)

4జీతో దేశంలో సంచలనాలు స‌ృష్టించిన రిలయన్స్‌ జియో (Reliance Jio) తాజాగా మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. తక్కువ ధర ల్యాప్‌ టాప్‌ ‘జియోబుక్‌’తో దేశంలో కొత్త ఒరవడికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. కాగా జియో సంస్థ నుంచి తక్కువ ధరకే ల్యాప్‌ టాప్‌ (4G enabled low-cost laptop) లను విడుదల చేస్తామని ఇటీవల రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేవలం రూ.15 వేల (184 డాలర్లు) ధరకే ల్యాప్‌ టాప్‌ ను (laptop at Rs 15000) విడుదల చేయనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ల్యాప్‌ టాప్‌ లో 4జీ సిమ్‌ కార్డును ఇన్‌ బిల్ట్‌ గా ఇవ్వనున్నారని, దానితో ఎక్కడైనా నేరుగా ఇంటర్నెట్‌ వాడుకునేందుకు వీలుగా ఉంటుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ల్యాప్‌ టాప్‌ ధర, ప్రత్యేకతలపై స్పందించేందుకు జియో వర్గాలు నిరాకరించాయి.

జియో ల్యాప్‌ టాప్‌ ల కోసం రిలయన్స్‌ సంస్థ ఇప్పటికే మైక్రో ప్రాసెసర్‌ ల తయారీ సంస్థ క్వాల్‌ కమ్‌, ఆపరేటింగ్‌ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో అవసరానికి అనుగుణంగా ప్రత్యేకంగా మార్పులు చేసిన ‘జియో ఆపరేటింగ్‌ సిస్టం’తోపాటు జియోకు సంబంధించిన కొన్ని యాప్స్‌ ను, ఇతర సదుపాయాలను జియో ల్యాప్‌ టాప్‌ లో ముందే ఇన్‌ స్టాల్‌ చేసి అందించనున్నారు. అదనంగా అవసరమైన యాప్స్‌ ను జియో స్టోర్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకుని ఇన్‌ స్టాల్‌ చేసుకోవచ్చని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

మనకంటే చాలా నెలల ముందుగానే పలు దేశాల్లో 5జీ సర్వీసులు, ప్రపంచవ్యాప్తంగా 5జీ సర్వీసులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసా? 5జీ సేవల్లో మనకంటే చాలా ముందున్న చైనా, కొరియా దేశాలు, 5జీ సర్వీసులతో లాభాలు, నష్టాలు తెలుసుకోండి!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం జియోకు 42 కోట్ల మంది టెలికం వినియోగదారులు ఉన్నారని.. ల్యాప్‌ టాప్‌ ల రాకతో జియో మార్కెట్‌ మరింతగా విస్తరిస్తుందని పేర్కొంటున్నాయి.

జియో ఈ నెలలోనే జియోబుక్‌ ల్యాప్‌ టాప్‌ లను విడుదల చేసే అవకాశం ఉందని.. మొదట స్కూళ్లు, ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు అందజేయనున్నారని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.మరో రెండు, మూడు నెలల్లో బహిరంగ మార్కెట్లోకి రావొచ్చని అంచనా వేస్తున్నాయి.