Reliance Jio: యూజర్లకు జియో ఝలక్, రూ.149 ప్లాన్‌లో స్వల్ప మార్పులు, ఇకపై వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే, మిగతా ప్రయోజనాలు యథాతథం
Relince Jio Rs. 149 Prepaid Plan Now Includes 300 Jio to Non-Jio Minutes, Reduced Validity of 24 Days (Photo-Twitter)

Mumbai, November 11: దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న రూ.149 ప్లాన్ బెనిఫిట్స్‌కు పలు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇకపై ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే 300 నిమిషాల జియో టు నాన్ జియో కాల్స్ వస్తాయి.

ఇక ఈ ప్లాన్ వాలిడిటీ గతంలో 28 రోజులు ఉండగా ఇప్పుడు దీన్ని 24 రోజులకు తగ్గించారు. మిగతా ప్రయోజనాలన్నీ యథాతథంగా ఉన్నాయి. అలాగే ఈ ప్లాన్‌ను జియో ఆల్ ఇన్ వన్ సెక్షన్‌కు తరలించింది. దీంతో ఆ విభాగంలోనే ఇకపై ఈ ప్లాన్ కస్టమర్లకు దర్శనమివ్వనుంది.

ఇదిలా ఉంటే జియో ఫోన్‌ను రూ.1500కు కాకుండా కేవలం రూ.699కే సొంతం చేసుకునే ఆఫర్‌ను గతంలోనే జియో ప్రకటించగా. ఇప్పుడా ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు జియో తెలిపింది. ఈ క్రమంలోనే ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఆఫర్‌కు గడువును పొడిగిస్తున్నట్లు జియో తెలియజేసింది. దీంతో వినియోగదారులు ఇప్పుడు కూడా కేవలం రూ.699 కే జియో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌ను కొన్నవారికి రూ.700 విలువైన ఉచిత డేటాను జియో అందిస్తున్నది.

జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు ‘ఆల్‌ వన్‌ ప్లాన్‌’ తీసుకొచ్చి విజయాన్ని సాధించిన జియో ఇదే వ్యూహాన్ని జియో ఫోన్‌ విషయంలో కూడా అమలు చేస్తోంది. జియోఫోన్‌ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆల్‌ ఇన్‌ వన్ మంత్లీ ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. రూ. 75, రూ.125, రూ.185 విలువైన రీచార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది.

ఈ ప్లాన్లలో వరుసగా నెలకు 3జీబీ (రోజుకు 0.1 జీబీ), 14జీబీ,(రోజుకు 0.5 జీబీ), 28 జీబీ (రోజుకు 1 జీబీ), 56 జీబీ (రోజుకు 2జీబీ) డేటాలను అందిస్తుంది. అంతేకాదు ఉచిత 500 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్‌ చేస్తోంది. అలాగే అపరిమిత జియో-టు-జియో, ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్‌లు కూడా ఉన్నాయి.