New Delhi, OCT 06: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ నియామకాలను చేపట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సుమారు 10వేల మంది కొత్త ఉద్యోగులను (SBI Recruitment) నియమించాలని భావిస్తోంది. అంతేకాదు.. కస్టమర్ సర్వీసుతో పాటు డిజిటల్ ఛానెల్‌లను బలోపేతం చేయనుంది. సాధారణ బ్యాంకింగ్, సిబ్బందితో టెక్నాలజీ పరంగా పటిష్టం చేయనున్నట్టు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఇటీవలే ప్రవేశ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు దాదాపు 1,500 మంది సాంకేతిక నిపుణుల నియామకాలను చేపట్టినట్టు ఆయన చెప్పారు.
“డేటా సైంటిస్ట్‌లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, నెట్‌వర్క్ ఆపరేటర్లు వంటి ప్రత్యేక ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వివిధ రకాల ఉద్యోగాల కోసం వారిని రిక్రూట్ చేస్తున్నాం. మొత్తంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8వేల మంది సిబ్బంది అవసరం ఉంటుంది. 10వేల మంది సిబ్బందిని ప్రత్యేక, సాధారణ విభాగాలకు నియమించుకోవాల్సి ఉంది” అని సీఎస్ శెట్టి పేర్కొన్నారు.
మార్చి 2024 నాటికి ఎస్బీఐ బ్యాంక్‌లో (SBI Bank) మొత్తం సిబ్బంది 2,32,296 మంది ఉన్నారు. ఇందులో 1,10,116 మంది అధికారులు గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. “కస్టమర్ అంచనాలు మారుతున్నాయి. సాంకేతికత మారుతోంది.. డిజిటలైజేషన్ విస్తృతంగా పెరుగుతోంది. బ్యాంకులో ఉద్యోగులను అన్ని స్థాయిలలో నిరంతరం రీస్కిల్ చేస్తున్నాం” అని ఆయన చెప్పారు. అంతేకాకుండా, కస్టమర్ల పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి బ్యాంక్ నిర్దిష్టమైన ప్రత్యేక నైపుణ్యాలను అందిస్తుంది.
నెట్‌వర్క్ విస్తరణ విషయానికి వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 శాఖలను ప్రారంభించాలని ఎస్‌బీఐ యోచిస్తోందని శెట్టీ చెప్పారు. ఎస్బీఐ మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపైనే దృష్టి సారిస్తుంది. చాలా రెసిడెన్షియల్ కాలనీలు మా పరిధిలోకి రావు. ప్రస్తుత సంవత్సరంలో సుమారు 600 శాఖలను ప్లాన్ చేస్తున్నామని శెట్టి చెప్పారు. బ్రాంచ్ నెట్‌వర్క్ కాకుండా, 65వేల ఏటీఎంలు, 85వేల బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా ఎస్బీఐ తన కస్టమర్లను చేరుకుంటుంది.