Chandrayaan 2: ఆర్బిటార్ నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్. ఇక ల్యాండింగ్ దిశగా జాబిల్లి వైపు ప్రయాణిస్తున్న విక్రమ్, వేరుపడిన ఆర్బిటార్ మాత్రం కక్ష్యలోనే.
Chandrayaan 2 Mission. | Photo - ISRO.

Bengaluru, September 2:  చంద్రయాన్ 2 ఆర్బిటర్ నుండి విక్రమ్ లాండర్‌ (Vikram Lander) ను విజయవంతంగా వేరు చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విభజన ఈ రోజు మధ్యాహ్నం 12:45 మరియు 1:45 మధ్య షెడ్యూల్ చేయబడింది, కాగా మధ్యాహ్నం 1:15 గంటలకు ఈ ప్రక్రియ విజయవంతగా పూర్తయిందని ఇస్రో తెలిపింది. అత్యంత కీలకమైన ఈ దశను ఎటువంటి సమస్య లేకుండా అధిగమించడంతో, సైంటిస్ట్ లు హర్షం వ్యక్తం చేశారు. ఇక మిగిలింది భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక చంద్ర మిషన్ తన లక్ష్యానికి చేరుకోవడంలో మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది.

జూలై 22న శ్రీహరి కోట నుంచి చంద్రయాన్ 2 (Chandrayaan 2) మిషన్ ప్రారంభమైంది. మొదట దీనిని భూకక్ష్యలో ప్రవేశపెట్టారు. అలా భూకక్ష్యలో ఆగష్టు 14 వరకు పరిభ్రమించింది, దశలవారీగా కక్ష్యను పెంచుతూ పోయారు. ఆ క్రమంలో ఆగష్టు 14న ఇది భూ కక్ష్య నుంచి వేరుపడింది. ఇక శూన్యంలో నుంచి వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి చొప్పించే ప్రక్రియలు చేపట్టారు. ఆగష్టు 20న చంద్రుడి కక్ష్యలో ప్రవేశ పెట్టబడింది. ఇక అప్పట్నించి వ్యోమనౌక చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధృవం వైపు వెళ్లేలా దానిని 90 డిగ్రీ కోణంలోకి మార్చి, కక్ష్యను తగ్గిస్తూ వచ్చారు. ఈ రకంగా వ్యోమనౌక చంద్రుడికి అత్యంత చేరువలోకి వచ్చేయడంతో 'విక్రమ్ ల్యాండర్' ను ఈరోజు వేరుపరిచారు. ఈ ప్రక్రియ కొన్ని మిల్లిసెకన్లలోనే జరిగిపోయింది. విక్రమ్ లాండర్ ప్రస్తుతం 119 కిమీ x 127 కిలోమీటర్ల కక్ష్యలో ఉంది. వేరుపడిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ మాత్రం దాని కక్ష్యలో అది చంద్రుని చుట్టూ పరిభ్రమనం కొఅసాగుతుంది.

రేపు కూడా (సెప్టెంబర్ 03, 2019)న ఉదయం 8:45 నుండి 9:45 మధ్య తదుపరి ప్రక్రియను షెడ్యూల్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 7న విక్రమ్ 'సాఫ్ట్ ల్యాండింగ్' పై ఇస్రో ప్రస్తుతం దృష్టి పెట్టింది. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా మరియు చైనా ల తర్వాత నాల్గవ దేశంగా భారత్ నిలుస్తుంది. అది కూడా అత్యంత తక్కువ బడ్జెట్ లోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్ ఘనత సాధిస్తుంది.