భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో గత నెలలో ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాణ్-2 మిషన్ మరో మైలురాయిని అధిగమించింది. ఇన్నిరోజులు భూమి చుట్టూ తిరిగిన చంద్రయాణ్2 బుధవారం వేకువ ఝామునే భూకక్ష్యను వీడింది. మరో ఆరురోజుల్లోనే ఇది చంద్రకక్ష్యలో ప్రవేశించనుంది.
20 నిమిషాల పాటు ద్రవ ఇంజిన్ ను మండించడం ద్వారా చంద్రుడి కక్ష్య వైపు అంతరిక్షనౌకను చొప్పించే ప్రక్రియ TLI ట్రాన్స్ లూనార్ ఇన్సర్షన్ బుధవారం ఉదయం 2:21 నిమిషాలకు విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చంద్రయాణ్ 2 ప్రయోగం చేపట్టిన దగ్గర్నించి ఇప్పటిదాకా ఐదు సార్లు ఈ కక్ష్యను పెంచుకుంటూ పోయే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇప్పుడు ఈ వ్యోమనౌక చంద్రుని కక్ష్య వైపు దూసుకుపోతుంది. ఆగష్టు 20న ఇది చంద్రుడి తొలి కక్ష్యలో ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. చంద్రయాణ్2 లోని ల్యాండర్ 'విక్రమ' చంద్రుడిపై ల్యాండ్ అయ్యేంతవరకు అత్యంత కీలకమైన 15 ఆపరేషన్లు ఇంకా చేపట్టవలిసి ఉందని, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అన్నీ పర్యవేక్షిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.
ఇప్పటివరకూ చంద్రయాణ్ 2 ప్రయాణం అంతా సావ్యంగానే సాగుతుందని, వ్యోమనౌక పనితీరు కూడా చాలా బాగా ఉందని చెప్తున్నారు. ఆగష్టు 20న చంద్రుడిలోకి ప్రవేశించే ముందు మరోసారి ద్రవ ఇంజిన్ ను మండించి కక్ష్యలు మార్చుకుంటూ పోతారు. భూకక్ష్యలో ఉన్నప్పుడు 170x39120 KM EPO (ఎర్త్ పార్కింగ్ ఆర్బిట్) కొలమానంతో ప్రయాణించిన మార్క్ III-ఎం1 శాటిలైట్ వెహికిల్, చంద్రుని కక్ష్యలో ప్రవేశప్రవేశపెట్టడానికి అవసరమయ్యే 100X100 KM కక్ష్యలోకి తగ్గించే ప్రక్రియ ప్రారంభమైంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చేనెల సెప్టెంబర్ 7న చంద్రయాణ్2 చంద్రుడిపై దిగి ప్రపంచ చరిత్రలో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించనుంది.