Newdelhi, Nov 11: భూ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ అంతరిక్షంలోని అద్భుత ఘట్టాలను ఆవిష్కరిస్తున్న నాసా (NASA) హబుల్ టెలిస్కోప్ (Hubble Telescope) మరో కీలక దృశ్యాన్ని గుర్తించింది. పరిమాణంలో సూర్యుడి కంటే కొన్ని వందల రెట్లు పెద్దదైన ఓ నక్షత్రంలో (Star) సంభవించిన భారీ విస్ఫోటనాన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. ఈ నక్షత్రం సూర్యుడి కంటే 530 రెట్లు పెద్దది. ఇది విస్ఫోటనం (సూపర్ నోవా (Supernova)) చెందుతూ, దానిలోని వాయువులను విశ్వంలోకి వ్యాపింపజేస్తూ మృత నక్షత్రంగా మారిపోయింది. ఈ సూపర్ నోవా 11 వందల కోట్ల సంవత్సరాల నాటి పేలుడు అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ఆ నక్షత్రం బాహ్యవాతావరణ పొరలు అన్నీ గ్యాస్ మయం అని, ఈ పొరలు భగ్గుమని మండిపోయి విశ్వాంతరాళాల్లోకి వ్యాపించినట్టు హబుల్ టెలిస్కోప్ రికార్డు చేసిన డేటా చెబుతోంది. హబుల్ టెలిస్కోప్ ఈ సూపర్ నోవాను ఎనిమిది రోజుల వ్యవధిలో మూడు చిత్రాలుగా రికార్డు చేసింది. దీనికి సంబంధించిన అధ్యయనం తాజాగా జర్నల్ నేచుర్ అనే పత్రికలో ప్రచురితమైంది.