Tea Bags Toxic: ఆఫీసులో టీ తాగుతున్నారా ! అయితే మీ బాడీలో ప్లాస్టిక్ ఎంతుందో చెక్ చేసుకోండి, ఒక్క టీ బ్యాగులోనే 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్ రేణువులు, షాకింగ్ న్యూస్ వెల్లడించిన అమెరికన్ కెమికల్ సొసైటీ
Tea bags may release billions of microplastics into your cup of tea, scientists say (Photo-WikimediaCommons)

September 28: ఈ రోజుల్లో టీ, కాఫీలు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పొద్దున్న లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగకుండా చాలామంది మంచం దిగరు. ఇంట్లో చక్కగా టీ పెట్టుకుని తాగేస్తుంటాం. అయితే ఆఫీసుల్లో పనిచేసేవారి పరిస్థితి ఏంటీ. ఉద్యోగం చేసేవారికి టెన్సన్ నుంచి రిలీఫ్ కావాలంటే ఖచ్చితంగా టీ కాని కాఫీ కాని పడాల్సిందే. ఇక కార్పొరేట్‌ ఆఫీసుల్లో టెన్షన్‌ ఫ్రీ అవడానికి అంటూ కప్పుల మీద కప్పులు టీ తాగుతుంటారు.అయితే వీరంతా టీ ఇంట్లో పెట్టుకున్నట్లు కాకుండా టీ బ్యాగుల మీద ఆధారపడుతుంటారు. టీ బ్యాగును నీటిలో కలుపుకుని కొంచెం చక్కెర వేసుకుని తాగుతుంటారు. ఇలా టీ బ్యాగును కలుపుకుని టీ తాగేవారు త్వరగా అనారోగ్యానికి గురవుతరానే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. టీ బ్యాగులు చాలా ప్రమాదకరమనే విషయాన్ని అమెరికా హెల్త్‌ జర్నల్‌ తాజాగా తన అధ్యయనంలో ప్రచురించింది. మీరు వాడే టీ బ్యాగును విషకరమైన ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేస్తున్నారని తెలిపింది.

సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో ఒక టీ బ్యాగ్‌ 11వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్, 3బిలియన్ నానో ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తుందని తేలింది. అయితే వీటిని మనం నేరుగా చూడలేము. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే ఈ రేణువులను చూడగలం. అందుకే మార్కెట్‌లో మనకు దొరికే కాఫీ, టీ బ్యాగులను వాడకూడదని, పొడిని మాత్రమే వాడాలని వారు చెబుతున్నారు.టీ బ్యాగుల నుంచి ప్లాస్టిక్‌ వస్తోందే తప్ప టీ నుంచి కాదని తెలిపారు. టీ తాగడం ద్వారా మనకు తెలీకుండానే బిలియన్ల ప్లాస్టిక్‌ కణాలను మనం శరీరంలోకి పంపుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అవి విడుదల చేసే ప్లాస్టిక్‌ రేణువులు మానవ కణంలోకి చొచ్చుకుపోయేంత చిన్న పరిమాణంలో ఉంటాయని ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని వారు హెచ్చరించారు. డజన్ల కొద్ది సర్వేలు ఈ విషయంపై ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయి. మనం తాగే నీటిలో, తినే ఆహారంలో ప్లాస్టిక్‌ కలుస్తోందని చెప్తూనే ఉన్నాయి.

కాగా కాఫీ, టీ బ్యాగులను నైలాన్, పీవీసీ, ఎపిక్లోరోపైడ్రిన్, థర్మో ప్లాస్టిక్, పాలిప్రొపెలిన్, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఈ క్రమంలో సదరు బ్యాగులను వేడి వేడి పాలు, లేదా నీటిలో ముంచినప్పుడు వాటి నుంచి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడి ఆ ద్రవంలో కలుస్తాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కార్సినోజెన్ల ( క్యాన్సర్ల కారకాలు) జాబితాకు చెందుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అవి క్యాన్సర్ వ్యాధులను కలగజేస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి కాఫీ లేదా టీ ఏదైనా వాడాలనుకునేవారు బ్యాగులను కాక పొడి రూపంలో వాటిని వాడాలని హెచ్చరిస్తున్నారు.