TikTok-Reliance Jio Deal: రిలయన్స్ చేతికి టిక్ టాక్ ? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త, అధికారికంగా స్పందించేందుకు నిరాకరించిన రిలయన్స్ గ్రూపు
Tiktok-Jio (Photo Credits: Wikimedia Commons)

New Delhi, Aug 13: ఇండియాలో చైనాకు చెందిన బైట్ డాన్స్ అనుబంధ సోషల్ మీడియా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను (TikTok) నిషేధించిన తరువాత, ఆ సంస్థ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ (mukesh ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్) టిక్‌టాక్‌ను కోనుగోలు చేయనుందన్న అంచనా వార్త (TikTok-Reliance Jio Deal) ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు టిక్ టాక్ యజమాన్య సంస్థ బైట్ ‌డాన్స్ తో ప్రారంభ దశ చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇరు కంపెనీల అధికారుల మధ్య ధర విషయమై చర్చలు సాగుతున్నాయని సమాచారం.

ఇండియాలో తమ మొత్తం వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు విక్రయించేందుకు బైట్ డ్యాన్స్ (Bytedance) సైతం సుముఖంగానే ఉందని ఈ విషయంలో టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్ స్వయంగా ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించారని, దాదాపు నెల రోజుల క్రితమే చర్చలు ప్రారంభమైనా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని 'టెక్ క్రంచ్' తన ప్రత్యేక రిపోర్టులో పేర్కొంది. ఇక టిక్ టాక్ భారత విభాగాన్ని సొంతం చేసుకోనుందన్న వార్తలపై అధికారికంగా స్పందించేందుకు రిలయన్స్ నిరాకరించింది. మళ్లీ 15కు పైగా చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం, బ్యాన్ లిస్టులో షియోమి ఎంఐ బ్రౌజర్ ప్రో,బైదూ సెర్చ్, భారత ప్రభుత్వం నుంచి ఇంకా రాని అధికారిక ప్రకటన

కాగా, సెప్టెంబర్ 15కు లోపే టిక్ టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మేసుకోవాలని ఆ తరువాత, చైనా మాతృసంస్థతో ఏ విధమైన లావాదేవీలనూ అనుమతించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పిన సంగతి విదితమే. టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ యూఎస్ టిక్ టాక్ బిజినెస్ ను కొనుగోలు చేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ నెలలో సరిహద్దుల వద్ద చైనా, దురాక్రమణకు దిగడం, చైనా దాడిలో 20 మందికి పైగా భారత జవాన్లు మరణించడంతో దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తుల నిషేధానికి ఉద్యమం రాగా, అదే నెల 29న టిక్ టాక్, షేరిట్ సహా 58 యాప్ లను భారత్ లో వాడటాన్ని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.