ఇటీవల కాలంలో దేశంలో మోసపూరిత, బెదిరింపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో, ట్రాయ్ (Telecom Regulatory Authority of India) స్పందించింది. ఈ తరహా అవాంఛనీయ కాల్స్ పై ట్రాయ్ వినియోగదారులకు సూచనలు చేసింది. TRAI పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. త్వరలో ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ వస్తున్న కాల్స్ ను నమ్మవద్దని తెలిపింది. ఫోన్ నెంబరు డిస్ కనెక్ట్ చేస్తామంటూ వచ్చే కాల్స్, సందేశాలు ఫేక్ అని ట్రాయ్ స్పష్టం చేసింది.
ఫేక్ కాల్స్ చేస్తున్న వ్యక్తులు ట్రాయ్ పేరిట వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ వినియోగదారులకు తాము ఇలాంటి కాల్స్ చేయడంలేదని, మెసేజ్ లు కూడా పంపడంలేదని ట్రాయ్ వివరణ ఇచ్చింది. ప్రజలు మోసగాళ్ల బారినపడి నష్టపోవద్దని సూచించింది. మొబైల్ కనెక్షన్ల రద్దుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నెంబర్లు బ్లాక్ చేసేందుకు తాము ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీకి అధికారం ఇవ్వలేదని తేల్చి చెప్పింది. ఆగని లేఆప్స్, 7 శాతం మంది ఉద్యోగులను తీసేసే యోచనలో Five9, ఆర్థిక మాంద్య భయాలే కారణం
టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల (సిమ్ కంపెనీలు) ద్వారానే నెంబరు బ్లాక్ అవుతుందన్న విషయాన్ని వినియోగదారులు గుర్తించాలని ట్రాయ్ సూచించింది. బిల్లింగ్, కేవైసీ వంటి కారణాలతో ఫోన్ నెంబర్లను టెలికాం ఆపరేటర్లు డిస్ కనెక్ట్ చేస్తారని వివరించింది. అనుమానిత కాల్స్ పై sancharsaathi.gov.in/sfc/ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని ట్రాయ్ పేర్కొంది. సైబర్ క్రైమ్ బాధితులు 1930 హెల్ప్ లైన్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. cybercrime.gov.in వెబ్ సైట్ లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.