
దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్న యూజర్లకు సెల్‌ఫోన్‌లో అలర్ట్ మెసేజ్ రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. యూజర్లు ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ రావడంతో కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ యూజర్లకు గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్‌ఫోన్లకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ చేస్తూ స్క్రీన్‌పై మెసేజ్ డిస్‌ప్లే అయ్యింది.
అయితే, టెస్టింగ్‌లో భాగంగానే ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఇలా అలర్ట్ మెసేజ్ పంపినట్టు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపంబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి.
ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది. దీన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి అని తెలిపింది.
విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది అని రాసి ఉంది. కాగా, ఈ మెసేజ్ ఇప్పటి వరకు మూడు భాషల్లో యూజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్, తర్వాత తెలుగు, చివరగా హిందీలో మెసేజ్‌లు వచ్చాయి.