New Delhi, DEC 14: మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. వాట్సాప్ కూడా తన వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించడానికి అనునిత్యం సరికొత్త ఫీచర్లు (feature) తీసుకొస్తూనే ఉన్నది. తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తేవాడానికి కసరత్తు చేస్తున్నది. ఇక నుంచి ఎవరైనా మెసేజ్ పంపితే ఒక్కసారి మాత్రమే (View Once Text feature) అది చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సదరు మెసేజ్ కనిపించకుండా పోతుంది. మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి ఆటోమేటిక్‌గా డిలిట్ అయిపోతుంది. అదే వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ (View Once Message Feature).అంటే ఇక నుంచి ఎవరైనా మనకు పంపిన మెసేజ్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కుదరదన్న మాట.
ఇంతకుముందు వాట్సాప్ అకౌంట్స్‌లో సభ్యులు చేసే చాట్ కొంత టైం తర్వాత ఆటోమేటిక్‌గా డిలిట్ అయ్యేలా డిస్అపియరింగ్ అనే ఫీచర్ (View Once Text feature) తీసుకొచ్చింది. ఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం ఒక్కసారి మాత్రమే కనిపించి తదుపరి కనిపించకుండా పోతాయి. దీని స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. వాట్సాప్ ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ మెసేజ్‌కు వర్తింప జేయాలని యోచిస్తున్నది.
టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్ అమలు చేయడానికి ప్రత్యేకించి ఒక సెండ్ బటన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చునని సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరు ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్న సంగతి మాత్రం వెల్లడించలేదు.