WhatsApp's Privacy Policy: వాట్సాప్‌కు కేంద్రం నోటీసులు, కొత్త ప్రైవసీ పాలసీ ఉపసంహరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక, నోటీసుపై స్పందించేందుకు ఏడు రోజుల గడువు
WhatsaApp (Photo Credits: Pxfuel)

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న సంగతి విదితమే. తన ప్రైవసీ పాలసీని ( WhatsApp's Privacy Policy) యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై ( WhatsApp) విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై తీవ్రస్థాయిలో స్పందించింది. పౌరుల హక్కులకు భంగం కలిగించేలా వాట్సాప్ నూతన ప్రైవసీ విధానం ఉందని పేర్కొంది.

తాజాగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీసు పంపించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని (Centre asks WhatsApp to withdraw New privacy policy ) ఈ నోటీసులో స్పష్టం చేసింది. సమాచార సంబంధిత గోప్యత, సమాచార భద్రతల విలువలను బలహీనపరచేదిగా ఈ పాలసీ ఉందని పేర్కొంది. ఈ నోటీసుపై స్పందించేందుకు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువులోగా స్పందించకపోతే చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొత్త విధానంలో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని అభిప్రాయపడింది. నూతన ప్రైవసీ విధానం ( WhatsApp's privacy policy changes) వాయిదా వేసి తప్పించుకోవాలని చూడొద్దని హెచ్చరించింది.

జియో మరో భారీ ప్రాజెక్ట్, భారత్ నుంచి ప్రపంచమంతా కేబుల్ వ్యవస్థ, ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌, సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం

కాగా వాట్సాప్‌నకు నోటీసును మే 18న ఎంఈఐటీవై మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ప్రైవసీ పాలసీ 2021ను ఉపసంహరించుకోవాలని ఈ నోటీసు ద్వారా తెలిపింది. యూరోపు, భారత దేశ యూజర్ల పట్ల వాట్సాప్‌ వ్యవహరిస్తున్న తీరును పరిశీలించినపుడు, భారత యూజర్లపై వాట్సాప్‌ వివక్ష ప్రదర్శిస్తోందనే విషయాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. భారతీయ యూజర్లపై అనుచితమైన నిబంధనలు, షరతులను విధించేందుకు ప్రస్తుత పరిస్థితిని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవడం వాట్సాప్ బాధ్యతారాహిత్యమని ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలా ఉంటే వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని లేదా 2021 జనవరి 4న విడుదల చేసిన అప్‌డేట్ నుంచి తప్పుకోవడానికి యూజర్లకు అవకాశం కల్పించాలని వాట్సాప్‌ను ఆదేశించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ వ్యాజ్యంపై స్పందిస్తూ హైకోర్టు ఫిబ్రవరిలో నోటీసులు జారీ చేసింది.

ఈ ఫేక్ కోవిన్ యాప్స్‌తో చాలా జాగ్రత్త, డౌన్లోడ్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయండి, మీ డేటా మొత్తం తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించిన ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం

అయితే కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించడానికి యూజర్లకు విధించిన గడువు మే 15ను పొడిగించలేదని వాట్సాప్ మే 17న ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. యూజర్లను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాట్సాప్ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ హైకోర్టుకు తెలిపారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీకరించకపోతే క్రమంగా వారి ఖాతాలను డిలీట్ చేస్తుందన్నారు. హైకోర్టు తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే రాబోయే ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీకరించవలసిందేనని, లేదంటే కొన్ని ముఖ్యమైన ఫంక్షన్స్‌ను కోల్పోక తప్పదని గత వారం వాట్సాప్ స్పష్టం చేసింది. మే 15 లోపున ఈ పాలసీని అంగీకరించని యూజర్లు తక్షణమే తమ ఖాతాల్లో పరిమితమైన ఫంక్షన్లను మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుందని తెలిపింది.