చైనా..భారత్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఎక్కువయిన నేపథ్యంలో షియోమి కొత్త వ్యూహానికి తెరలేపింది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ విక్రయాలను విస్తరించడంలో భాగంగా ఎంఐస్టోర్ ఆన్ వీల్స్(MiStore-on-wheels) అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామీణ భారతీయ వినియోగదారులను చేరుకోవాలని యోచిస్తోంది. దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ బ్రాండ్ షియోమి ట్రావెలింగ్ స్టోర్ (Xiaomi’s Travelling Store) ప్రారంభించింది. అంటే గ్రామీణులకు చేరువయ్యేలా నిర్దిష్ట ప్రదేశాల్లో ఆగుతూ, వారాంతపు సంతలు, ఉత్సవాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ షావోమి సంత నిర్వహిస్తుంది.
ఇందులో స్మార్ట్‌ఫోన్లతోపాటు, స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, ఇయర్ ఫోన్లు, సన్ గ్లాసెస్, పవర్ బ్యాంకులు ఇలా పలు ఉత్పత్తులను విక్రయించనున్నట్లు షావోమి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది."ఎంఐస్టోర్-ఆన్-వీల్స్" ను ప్రారంభించడం సంతోషంగా ఉందని షియోమి ఇండియా సీఎండీ మనుకుమార్ జైన్ వెల్లడించారు. మూవింగ్ స్టోర్ ద్వారా రీటైల్ అనుభవాన్ని గ్రామీణులకు చేరువ చేస్తున్నామని ట్వీట్ చేశారు.
ఈ ప్రాజెక్టును కేవలం 40 రోజుల్లో పూర్తి చేసిన తమ ఆఫ్‌లైన్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులకు తాము 100 శాతం కట్టుబడి ఉన్నామని మరో ట్వీట్ లో జైన్ వెల్లడించారు. అన్ని ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియన్స్, మేడ్ బై ఇండియన్స్ అంటూ ట్వీట్ చేశారు.
Here's Manu Kumar Jain Tweet
"Mi"les to go before we sleep!
Excited to launch "#MiStore-on-wheels", an innovative concept that brings #retail experience to the heart of #India, connecting villages through a moving store.
So proud of our #offline #team who completed this project in just 40 days.
I ❤️ Mi pic.twitter.com/7OECCNnlgb
— Manu Kumar Jain (@manukumarjain) September 21, 2020
తమ స్టోర్-ఆన్-వీల్స్ అవుట్‌లెట్‌లు ప్రస్తుత కరోనా సమయంలో పూర్తిగా సురక్షితంగా ఉంటాయని ఎంఐ ఇండియా సీఓఓ మురళీకృష్ణన్ తెలిపారు. అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రిటైల్ నెట్‌వర్క్ ఉన్న తాము ఈ కొత్త ప్రయోగం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోనున్నామని చెప్పారు. కాగా కరోనా సంక్షోభం, లాక్ డౌన్, ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, చైనా ఉత్పత్తులపై నిషేధం డిమాండ్ లాంటి ఎదురుదెబ్బల మధ్య కూడా షావోమి జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది.