Tehran, NOV 05: ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల్లో (anti-hijab protest) మరోసారి కలకలం చెలరేగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై నిన్న భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కొన్ని వారాల క్రితం హిజాబ్ (Hijab) సరిగా ధరించలేదంటూ పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అయితే, ఇరాన్ యువతలో చైతన్యం రావడంతో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పదే పదే భద్రతా బలగాలు, ఆందోళనకారులకు ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
నిన్న ఖాష్ కౌంటీ సహా పలు నగరాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను వద్దకు భద్రతా బలగాలు వెళ్లి, కాల్పులు జరిపాయి. ఆందోళన సమయంలో ఓ భవనం నుంచి పొగలు కూడా వచ్చాయని ఇరాన్ (Iran) మీడియా పేర్కొంది. ఇరాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితి విచారణ జరపాలని అక్కడి మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.
భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య చెలరేగుతున్న ఘర్షణల్లో పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇనార్ లో కఠిన చట్టాలు, హిజాబ్ నిబంధనలు వద్దంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు.