Iraq Fire Accident (PIC @ X)

Al-Hamdaniyah, SEP 27: ఇరాక్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాక్‌లోని అల్-హమ్దానియా (Al-Hamdaniyah Fire) పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్‌లో వివాహ సమయంలో (Fire During Wedding) మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. (Iraq Fire During Wedding) ఇరాక్‌లోని అల్-హమ్దానియాలోని ఈవెంట్ హాలులో వివాహ వేడుక జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 100మంది సజీవ దహనమయ్యారు. ఎగసిపడిన అగ్ని కీలలకు గాయపడిన 150 మందిని హమ్దానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. (100 Killed, Over 150 Injured) వివాహ వేడుక జరుగుతున్న పెద్ద ఈవెంట్ హాల్‌లో మంటలు చెలరేగడానికి ఈ వేడుకలో ఉపయోగించిన బాణాసంచా కారణమని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని ఇరాక్ పౌర రక్షణ విభాగం తెలిపింది.

 

ఎగసిపడిన మంటల్లో ఈవెంట్ హాలు కాలిపోయింది. ఇరాక్ సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఫెడరల్ ఇరాకీ అధికారులు అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. ఈ ఘోర అగ్నిప్రమాదంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. సంఘటన స్థలంలో ఎటు చూసినా సజీవ దహనమైన మృతదేహాలు కనిపించాయి. గాయపడిని వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడి వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర ఇరాక్‌లో క్రైస్తవ వివాహానికి ఆతిథ్యం ఇస్తున్న హాలులో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని బాగ్దాద్‌కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసుల్ నగరానికి వెలుపల క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో పెళ్లి మండపంపై మంటలు ఎగసిపడుతున్నట్లు టెలివిజన్ ఫుటేజీలు చూపించాయి.

 

ఈ అగ్ని ప్రమాదంలో ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్ చెప్పారు. ప్రధాన మంత్రి మహమ్మద్ షియా అల్-సుడానీ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన వారిలో కొందరిని ప్రాంతీయ ఆసుపత్రులకు తరలించినట్లు నినెవే ప్రావిన్షియల్ గవర్నర్ నజిమ్ అల్-జుబౌరీ తెలిపారు. మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.