New Delhi, May 09: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సిటీలో భారత్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధూ (Navjeet Sandhu) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన సోదరులు అభిజిత్, రాబిన్ గార్టన్‌ను న్యూసౌత్‌వేల్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన నవజీత్ సంధూ 2022 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో అభిజిత్, రాబిన్ సోదరులతో గొడవ నేపథ్యంలో ఈ నెల 6న దారుణహత్యకు (Navjeet Sandhu Murder) గురైన విషయం తెలిసిందే.
హర్యానా రాష్ట్రానికే చెందిన ఇద్దరు సోదరుల మధ్య జరిగిన గొడవ పెద్దదై తన కొడుకు ప్రాణాల మీదికి తెచ్చిందని నవజీత్ తండ్రి జితేందర్ సంధూ చెప్పారు. తమకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో నవజీత్ మిత్రులు ఫోన్ చేశారని, నవజీత్ మరణించాడని చెప్పారని అన్నారు. నవజీత్ తోటి విద్యార్థులే గొడవపడి మధ్య అడ్డుకోబోయిన తన కొడుకును చంపేశారని విలపించారు. శ్రావణ్‌కుమార్ అనే విద్యార్థి తన రూమ్మేట్స్‌తో గొడవపడి నవజీత్ ఫ్లాట్‌కు వెళ్లాడని, తర్వాత అతని రూమ్మేట్‌కు ఫోన్ చేసి బయటికి రావాలని డిమాండ్ చేశారని, దాంతో శ్రావణ్ తనకు తోడుగా రమ్మనడంతో నవజీత్ వెళ్లాడని జితేందర్ సంధూ తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణ్‌పై కత్తితో దాడి చేస్తున్న వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా నవజీత్‌ను పొడిచారని వెల్లడించారు.